Karimnagar RTC Bus Fire Accident | కొత్తపల్లి: కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. కరీంనగర్ డిపో నుండి హైదరాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తున్న ఈ ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగాయి. తిమ్మాపూర్ మండలం అలుగునూరు సమీపంలోకి రాగానే ఒక్కసారిగా బస్సులో పొగలు వచ్చాయి. ఇది గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై, బస్సును రోడ్డు పక్కకు నిలిపివేశారు.
బస్సు నుంచి దిగిపోయిన ప్రయాణికులు.. అంతా సేఫ్సమయస్ఫూర్తితో వ్యవహరించిన డ్రైవర్, బస్సులో ప్రయాణిస్తున్న 41 మంది ప్రయాణికులను వెంటనే కిందికి దించేశారు. ప్రయాణికులందరూ బస్సులో నుంచి కిందకు దిగిన కొద్ది క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తం వేగంగా వ్యాపించి, వాహనం పూర్తిగా మంటల్లో కాలిపోయింది. బస్సు డ్రైవర్ నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. డ్రైవర్ సకాలంలో స్పందించడం వల్ల ఒక పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కరీంనగర్-2 డిపోకు చెందిన ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఏపీ, తెలంగాణలో వరుస బస్సు ప్రమాదాలు..
అయితే ఇటీవల ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు అగ్ని ప్రమాదాలకు గురవుతన్నాయి. ప్రయాణికులతో వెళ్తున్న బస్సుల్లో ఒక్కసారిగా పొగలు వస్తున్నాయి. ప్రయాణికులను కిందకి దించివేసిన కొంత సమయానికే బస్సులు మంటల్లో కాలిపోతున్నాయి. అయితే పగటి పూట ప్రమాదాలను గుర్తించి ప్రాణ నష్టాన్ని నివారించకలుగుతున్నారు. ఒకవేళ రాత్రివేళ ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటని ప్రయాణికుల నుంచి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల ఏపీ, తెలంగాణ మధ్య నడిచే కొన్ని బస్సు సర్వీసుల్లో అగ్నిప్రమాదాలు సంభవించి పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడాన్ని ప్రజలు ఇంకా మరిచిపోలేకపోతున్నారు. ఏపీలో కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదం, వికారాబాద్ జిల్లాలో కంకర లోడ్ టిప్పర్ లారీ బస్సు మీద పడిన ప్రమాదాలు ఇంకా ప్రజల కళ్ల మందు కదలాడుతున్నాయి. ఓవైపు బస్సు రోడ్డు ప్రమాదాలకు గురవుతుంటే, మరోవైపు అగ్ని ప్రమాదాలు సైతం ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.
