జగిత్యాలకు వెళ్లే మార్గంలో రాత్రి గంగాధర పరిధిలో నాలుగు వాహనాలు అదుపుతప్పి ఢీ కొన్నాయి. ఇందులో ఒకటి లారీ కాగా రెండు వ్యాన్‌లు ఉన్నాయి. ఈ ప్రమాదంలో జగిత్యాలకు చెందిన ఓ ప్రైవేట్ బస్ నుజ్జునుజ్జు అయింది. 


లారీడ్రైవర్ నరకయాతన


లారీ డ్రైవర్ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయాడు. అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని అతి కష్టమ్మీద బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. 


బస్సులో, వ్యాన్‌లో ఉన్న దాదాపు పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని కూడా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అందులోని చాలమంది వారి వారి స్వస్థలాలకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. 


ఎగబడ్డ జనం


ఇదంతా ఒక ఎత్తైతే ప్రమాదం తర్వాత అక్కడ కనిపించిన దృశ్యాలు షాక్‌ కలిగిస్తున్నాయి. ప్రమాదం జరిగిన ఓ వ్యాన్‌లో కోడి గుడ్లు ఉన్నాయి. ఆ లోడ్‌ తిరగబడిపోయింది. ఆ వ్యాన్‌లో ఉన్న గుడ్లు రోడ్‌ పాలయ్యాయి. 


ఉదయాన్ని అక్కడి గుడ్లు చూసిన జనం ఎగబడ్డారు. కిందపడిన గుడ్ల స్ట్రేలను ఎత్కుకుపోయారు. పెద్ద పెద్ద సంచులు తీసుకొచ్చి మరీ గుడ్లు ఎత్కుకెళ్లిపోయారు. అర్థరాత్రి ఎప్పుడో ప్రమాదం జరిగితే ఉదయం గుర్తించారు జనం. గుడ్లు పడిపోయిన సంగతి అలా తెలిసిందో లేదో ఇలా ఎత్తుకెళ్లిపోయారు. క్షణాల్లో అక్కడి గుడ్లన్నీ ఖాళీ అయిపోయాయి. 


ప్రమాదం విషయం తెలుసుకొని వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


రంగారెడ్డి కూడా ఇలాంటి సంఘటన


ఈ మధ్య రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. కూల్‌డ్రింక్స్‌తో వెళ్తున్న లారీ బోల్దా పడింది. వేకువజామున జరిగిందీ సంఘటన. ప్రమాదంలో కూల్‌డ్రింక్స్‌ అన్నీ కిందపడిపోయాయి. వెంటనే జనం కూల్‌ డ్రింక్స్‌ను తీసుకెళ్లిపోయారు. ఒక్కొక్కరు బాటిళ్లు బాటిళ్లు ఎత్తుకెళ్లిపాయారు. ఈ వారంలోనే ఈ సంఘటన కూడా జరిగింది.