Maoists Arrest In Karimnagar : తెలంగాణలో నక్సల్స్ అంటేనే గతంలో గుర్తుకు వచ్చే ప్రాంతం కరీంనగర్ జిల్లా. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కరీంనగర్ జిల్లాలో ఎడతెగని కార్యకలాపాలతో పోలీసులతో నువ్వా నేనా అన్నట్టు ఉండేది నక్సలైట్ల వ్యవహారం. తర్వాత క్రమంలో పోలీసులు తీసుకున్న చర్యలతో తగ్గిపోయిన వారి కార్యకలాపాలు తిరిగి పుంజుకున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ లోని మావోయిస్టులకు మందుగుండు సరఫరా చేస్తున్న ఐదుగురు కొరియర్ లను కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు కరీంనగర్, హైదరాబాదు రోడ్డులోని టోల్ గేట్ ప్లాజాల వద్ద అరెస్టు చేసినట్టు కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు.
నిందితులు ఎవరంటే..
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా బెజ్జంకి క్రాస్ రోడ్‌కి చెందిన బాసవేని రాజయ్య (56), అక్కన్నపేట మండలంకి చెందిన గొర్ల బాపు (40), హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ కు చెందిన నాగబోయిన నాగరాజు (50), ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో జిల్లా భూపాలపట్నం తాలూకా అచ్చు వెళ్లికి చెందిన మూడు వేల చిన్నారావు (32), రుద్రారం కి చెందిన కొండగోర్ల సునీల్ (27) అనే వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. వీరి వద్ద నుంచి 14 బాక్సుల డిటోనేటర్లు, 7 బండిల్స్ సేఫ్టీ ఫ్యూస్ వైర్, నాలుగు కాయిల్ లూస్ బెండిల్స్, రూ.1.5 లక్షల నగదు, 4 మొబైలస్, ఒక స్విఫ్ట్ డిజైర్ కార్ ఒక స్కార్పియో వాహనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
కేంద్ర కమిటీ సభ్యుడైన రామచంద్ర రెడ్డి అలియాస్ వికల్ప్ అలియాస్ రాజు దాదా, స్టేట్ కమిటీ మెంబర్ అయిన కూకటి వెంకటి అలియాస్ వికాస్, ఏరియా డివిజనల్ కమిటీ మెంబర్ నగేష్ భూపాలపట్నం తాలూకా రుద్రవరం పంచాయతీ సెక్రెటరీ కోరెం విజయ్, హుస్నాబాద్ లోని మహబూబాబాద్ కి చెందిన కస్తూరి రాజు, భూపాలపట్నం తాలూకా బందిపూరకు చెందిన రమేష్ పరారీలో ఉన్నారని సీపీ సత్యనారాయణ తెలిపారు.
మళ్లీ దాడులకు సిద్ధమయ్యారా !
గతంలో కరీంనగర్ కేంద్రంగా పలురకాల దాడులకు మావోయిస్టులు ప్లాన్ చేసి అమలుపరిచారు. దీంతో గతంలో అనేక మంది పోలీసులు సైతం మృతిచెందారు. అయితే ఈసారి వారికి అవసరమైన మందుగుండు సామాగ్రిని అందించే క్రమంలో దాదాపు మూడు లక్షల క్యాష్ కి డీల్ మాట్లాడి వారి నుండి డబ్బులు తీసుకొని పేలుడు పదార్థాలను కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక వీరంతా పేలుడు పదార్థాలను సేకరించి చత్తీస్ఘడ్ కు వెళ్లి మావోయిస్టులకు ఇవ్వడానికి సిద్ధపడుతుండగా పట్టుకున్నామని సీపీ సత్యనారాయణ వెల్లడించారు.