BRS Leader KTR | సిరిసిల్ల: ఓ యువతి రాసిన లేఖ, తన వివాహానికి హాజరు కావాలని పంపిన లేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కదిలించింది. గంభీరావుపేట మండలానికి చెందిన యువతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కూతురు. తన వివాహానికి హాజరై ఓ అన్నగా అండగా నిలిచి, ఆశీర్వదించాలని ఆమె కేటీఆర్‌కు ఆహ్వానం పంపింది. ఆ ఆహ్వానం మేరకు పెళ్లి వేడుకకు హాజరైన కేటీఆర్ నూతన దంపతులను ఆశీర్వదించారు. అందుకు సంబంధించిన విషయాలను కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఆమె ఆహ్వానం ఒక మాటకంటే ఎక్కువ
‘ఈ రోజు నాకు ఓ హృదయాన్ని తాకే ఆహ్వానం అందింది. ఇది కేవలం ఆహ్వానం కాదు, ఒక మానసిక బంధానికి గుర్తు. ప్రతి కుమార్తె తన పెళ్లి సమయంలో నాన్న ఆశీర్వాదాన్ని, అన్నయ్య అండను కోరుకుంటుంది. కానీ నా చెల్లెలు, తన నాన్నగారు నర్సింలు గారు, అన్నయ్య నరేష్ లను కోల్పోయిన తర్వాత, ఆ బాధను భరిస్తూ, ఆ స్థానం నాలో చూడడం నాకు చాలా ప్రత్యేకమైన అనుభూతి కలిగించింది. ఆమె ఆహ్వానం నాకు ఒక మాటకంటే ఎక్కువ. అది నన్ను అన్నగా చూసే నమ్మకానికి, ప్రేమకి, అండగా ఉండాలన్న ఆశకి నిదర్శనం.
నిజమైన తెలంగాణ బిడ్డలు, బీఆర్ఎస్ బలగానికి ధ్యానబోయిన కుటుంబం ఒక నిండైన ఉదాహరణ. గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన నర్సింలు జీవితాంతం బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి పనిచేశారు. కరోనా సమయంలో ఆయన మరణం, ఆ తర్వాత కొడుకు నరేష్ రోడ్డు ప్రమాదంలో మృతి ఆ కుటుంబానికి తీరని లోటు. తన మరణానంతరం అవయవాలను దానం చేసి, నరేష్ మానవతకు కొత్త అర్ధం ఇచ్చారు. అలాంటి కుటుంబానికి అండగా ఉండడం నాకు కేవలం ఒక బాధ్యత కాదు, అది గౌరవం.
కేటీఆర్ గుండెకు హత్తుకునే విషయం..
నవిత పెళ్లికి అన్నగా నేను అండగా ఉండడం, ఆమె ఆనందంలో భాగస్వామిగా మారడం నా గుండెను హత్తుకునే విషయం. ఇలాంటి సందర్భాలు నాకు ఎప్పుడూ గుర్తుకొస్తాయి. మనమంతా ఒకటే కుటుంబం అన్నది నిజమే. చెల్లెలు నవిత, భర్త సంజయ్ తో కలసి సుఖసంతోషాలతో, ప్రేమతో, ఆశీర్వాదాలతో నిండిన జీవితం గడపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుంది అని’ కేటీఆర్ హామీ ఇచ్చారు.