Bandi Sanjay | కరీంనగర్: పేదరికం ఉన్నంతకాలం నక్సలిజం కొనసాగుతుందన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు అసంబద్ధమైనవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు. “నక్సల్స్‌తో చర్చలు జరపాలంటూ మాట్లాడటం హాస్యాస్పదం. గతంలో కాంగ్రెస్ నక్సలైట్లతో చర్చలు జరిపి ఏం సాధించింది?” అంటూ ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు నక్సలైట్లపై నిషేధం విధించిన కేసీఆర్, అధికారానికి దూరమైన తర్వాత చర్చల మాటలు తీసుకురావడాన్ని ఆయన ఆక్షేపించారు. నక్సల్స్ చేతిలో వేలాది మంది అమాయకులు మరణించినప్పుడు ఆ సంఘటనలను "సామాజిక కోణం"గా ఎందుకు చూడలేకపోయారు అని పౌర హక్కుల నేతల వ్యాఖ్యలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
నక్సల్స్ వల్ల ఇప్పటివరకు సుమారు 50 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, 9 వేల మంది పోలీసులూ అమరులయ్యారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఆపరేషన్ కగార్‌ను నిలిపేయాలన్న ఆలోచనే లేదని, నక్సల్స్ నిర్మూలన పూర్తి అయేంత వరకూ ఈ యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2026 మార్చి నాటికి ‘నక్సల్స్ ముక్త్ భారత్’ సాధించడమే లక్ష్యమని తెలిపారు.
విద్యార్థి దశలోనే ఏబీవీపీలో ఫుల్ టైమర్‌గా పనిచేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, విద్యార్థుల సమస్యలపై పోరాడే సమయంలో తలపడ్డ కేసులే తనను రాజకీయాల్లోకి నడిపించాయని బండి సంజయ్ చెప్పారు. కరీంనగర్‌లో ABVP ఆధ్వర్యంలో జరిగిన “నక్సల్స్ నరమేధం - మేధోమథనం” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, నక్సల్స్ హింసకు గురైన ABVP కార్యకర్తలకు నివాళి అర్పించారు.
నక్సలిజం నిర్మూలనకు కేంద్రం కట్టుబడి ఉందిప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 2026 మార్చిలోపు దేశాన్ని నక్సల్స్ విముక్తంగా మార్చాలనే సంకల్పంతో ముందుకెళ్తోంది. హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ‘ఆపరేషన్ కగార్’ ప్రారంభించి, దిశగా దశలవారీగా చర్యలు తీసుకుంటోంది. గతంలో యూపీఏ పాలనలో 200కి పైగా జిల్లాల్లో ఉన్న నక్సలిజం, నేడు కేవలం 12 జిల్లాలకు పరిమితమైందని తెలిపారు.
నక్సలిజం వల్ల అభివృద్ధి ఆగిపోవడమే కాక, వేలాది మంది ప్రజలు, పోలీసులు ప్రాణాలు కోల్పోయిన దుస్థితిని గుర్తు చేశారు. విద్య, ఆరోగ్యం, రవాణా రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఇది ప్రజాస్వామ్యాన్ని సంక్షోభంలోకి నెట్టిందని అన్నారు. తుపాకులు చేతపట్టి పోరాటం చేస్తూ, పేదల అభివృద్ధిని అడ్డుకుంటూ వచ్చే వారు దేశ భక్తులుగా ఎలా పరిగణించగలమని ప్రశ్నించారు.
నక్సల్స్ చర్చలతో మారరని చరిత్రే చూపిందినక్సల్స్‌తో గతంలో జరిగిన చర్చలు ఫలితాలివ్వలేదని గుర్తు చేస్తూ, తుపాకి కింద చర్చలేంటని ప్రశ్నించారు. నక్సలైట్లపై ప్రేమ చూపుతున్న నాయకులు నిజంగా గట్టిగా ఉండాలంటే, రాష్ట్రంలో నక్సలైట్లపై విధించిన నిషేధాన్ని ఎత్తేయమని సవాల్ విసిరారు. పదేళ్లపాటు సీఎంగా ఉన్నప్పుడు చర్చల సంగతి ఎందుకు గుర్తుకు రాలేదని కేసీఆర్‌పై బండి సంజయ్ మండిపడ్డారు.
అర్బన్ నక్సల్స్ అనే పేరుతో నిషేధిత సంఘాలకు మద్దతు ఇచ్చే నాయకులు విద్యా సంఘాల్లో సభ్యులను నియమించడం ఏమాత్రం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. మానవ హక్కుల పేరుతో నక్సల్స్ కార్యకలాపాలను సమర్థించడం అమానుషమని, తుపాకుల వీడే వరకు సామాజిక కోణం చర్చకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
నక్సల్స్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారుచత్తీస్‌గఢ్‌లో ‘జనతన సర్కార్’ పేరిట తుపాకులతో ప్రజల్ని చంపిన నక్సల్స్, పాఠశాలలు నిషేధించి విద్యను అడ్డుకున్నారన్నారాయన. పేదరికాన్ని నిర్మూలిస్తామంటూ హింసచేశారనీ, వారి కారణంగా అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. దేశంలో పేదరికం ఎక్కువగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోనే ఉందని, ఇది వారిచేతమే సృష్టించబడిందని తేల్చిచెప్పారు.
బాలెట్ కాదు, బుల్లెట్ తత్వం నక్సలిజం“మేము బాలెట్‌తో సమాధానం చెబుతాం, వాళ్లు బుల్లెట్‌తో జవాబిస్తం అంటున్నారు. ప్రజాస్వామ్యంలో తుపాకీ ఒక్కరే పట్టాలి, అది పోలీసుడే కావాలి” అన్నారు. తుపాకులు చేతబట్టి హింసకు పాల్పడే వారికి ఏ మాత్రం చలించేది లేదని, పూర్తి స్థాయిలో నక్సల్స్ నిర్మూలనకే కేంద్రం కట్టుబడిందని బండి సంజయ్ స్పష్టం చేశారు.