KTR and Harish Rao fires on MLA Kaushik Reddy incident in Huzurabad | హైదరాబాద్: మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని మరోసారి రుజువైందంటూ బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు నిప్పులు చెరిగారు. గతంలో కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం రెండో విడత నిధులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎమ్మెల్యేపై దాడి చేయడమేనా ఇందిరమ్మ రాజ్యమంటే? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దల మెప్పు పొందేందుకు రాష్ట్రంలో పోలీసులు పనిచేస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తప్పకుండా పోలీసులకు వడ్డీతో చెల్లిస్తాం అని కేటీఆర్ హెచ్చరించారు.
హుజురాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిపై కేటీఆర్ స్పందించారు. పథకాల హామీపై నిలదీస్తున్నందుకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కక్ష పెంచుకున్నారని ఆరోపించారు. అరికెపూడి గాంధీతో కౌశిక్ రెడ్డిపై దాడి చేసే ప్రయత్నం చేశారని.. పోలీసులు కూడా ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం పనిచేస్తున్నారని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పార్టీ అండగా ఉంటుంది: కౌశిక్ రెడ్డికి ఫోన్లో హరీశ్ రావు పరామర్శ
హైదరాబాద్: హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర అస్వస్థకు గురయ్యారని తెలియడంతో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్ చేసి పరామర్శించారు. దళిత బంధు నిధుల విడుదలపై లబ్దిదారులతో కలిసి నిరసన తెలిపితే తనపై దాడికి యత్నించారని హరీష్ రావుకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు. హుజురాబాద్ లో బీఆర్ఎస్ ఆందోళన చేపట్టిన క్రమంలో జరిగిన ఘటన తీరు, కౌశిక్ రెడ్డి ఆరోగ్యం గురించి హరీష్ రావు అడిగి తెలుసుకున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కౌశిక్ రెడ్డికి పార్టీ అండగా ఉంటుందని హరీష్ రావు భరోసా ఇచ్చారు. అవసరమైతే మనం న్యాయపరంగా ముందుకు వెళ్దామని కౌశిక్ రెడ్డికి హరీష్ రావు సూచించారు.
అసలేం జరిగిందంటే..
హుజురాబాద్: దళిత బందు రెండో విడత నిధులు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. దళితబంధు దరఖాస్తుదారులతో కలిసి కౌశిక్ రెడ్డి ధర్నా చేసేందుకు అంబేద్కర్ చౌరస్తాకు వెళ్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించాలని పోలీసులు యత్నించగా.. పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఒక్కసారిగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను చికిత్స కోసం హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు.
Also Read: Kaushik Reddy: బీఆర్ఎస్ ఆందోళనలో ఉద్రిక్తత, స్పృహతప్పి పడిపోయిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
అయితే దళిత బంధు నిధులు విడుదల చేయాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే పోలీసులు తమను అడ్డుకోవడం ఏంటని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వారిని ప్రశ్నించడం ఇందిరమ్మ రాజ్యంలో తప్పిదమా అని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోగ్యంపై ఆయన కుటుంబసభ్యులు, బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.