Kaushik Reddy Fell ill | హుజురాబాద్: బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన ఆందోళనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దళిత బందు రెండో విడత ఇవ్వాలంటూ హుజురాబాద్ ఎమ్మెల్యే  కౌశిక్  రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు శనివారం నాడు ఆందోళన చేపట్టాయి. పోలీసులు వచ్చి వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా అక్కడ తోపులాట జరిగింది. పోలీసులు కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా.. ఒక్కసారిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన స్పృహ కోల్పోయేలా కనిపించడంతో బీఆర్ఎస్ శ్రేణులు వెంటనే కౌశిక్ రెడ్డిని హుజరాబాద్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోగ్యంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.


దళితబంధు దరఖాస్తుదారులతో కలిసి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ధర్నా కోసం అంబేద్కర్ చౌరస్తాకు వెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణులకు తోపులాట జరిగింది. కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. రెండవ విడుత దళిత బందు కోసం కౌశిక్ రెడ్డి ఇంటికి దళితులు బారులు తీరారు. 






కాంగ్రెస్ ప్రభుత్వం దళితబంధు రెండో విడత నిధులు విడుదల చేసే వరకు మా పోరాటం ఆగదు. తలతెగినా మేం వెనకడుగు వేసేది లేదు. లబ్ధిదారులకు దళిత బంధు ఇచ్చేంత వరకూ తెలంగాణ ప్రభుత్వంతో కొట్లాడతా. నవంబర్ 20 తేదీలోగా రెండో విడత నిధులు విడుదల చేయకపోతే హుజూరాబాద్‌ నియోజకవర్గం రణరంగం అవుతుంది. నియోజకవర్గంలో ఏ ఒక్క కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులను, నేతల్ని తిరగనిచ్చేది లేదు.


నాడు పైలెట్ ప్రాజెక్టుగా దళిత బంధు పథకం


దళితుల అభ్యున్నతి కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాడు పైలెట్‌ ప్రాజెక్టుగా దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారు.  హుజూరాబాద్‌లో సుమారు 20వేల కుటుంబాలకు దళిత బంధు ఇచ్చి వారిని ఆదుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు రెండో విడత దళిత బంధు డబ్బులు తీసుకోకుండా ఖాతాలను ఫ్రీజ్‌ చేసింది. దళిత బంధు ఇవ్వకుండా దళితులను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో దళిత బంధుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశాను. దళిత బంధు ఇవ్వకపోతే పరిస్థితి మరోలా ఉంటుందని’ కౌశిక్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని రెండు రోజుల కిందట హెచ్చరించారు.



నవంబర్ 9 నుంచి హుజూరాబాద్‌ పట్టణంలోని తన ఇంటి వద్ద టెంట్‌ వేసుకొని ఉంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇటీవల చెప్పారు. దాంతో దళిత బంధు రెండో విడత నిధులు రాని వారు ఎమ్మెల్యే ఇంటికి క్యూ కడుతున్నారు. పండించిన పంటలకు మద్దతు ధర ఇవ్వడం లేదని, అటు రైతు భరోసా కూడా రావడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం కొనకపోవడంతో ధాన్యాన్ని వచ్చిన ధరలకే అమ్ముకుని మోసపోతున్నామని రైతులు బీఆర్ఎస్ నేతలకు తమ గోడు చెప్పుకుంటున్నారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం వర్షన్ మరోలా ఉంది.. పంటలకు మద్దతు ధర కల్పి్స్తున్నామని, నిధులు సమకూరితే రైతు భరోసా లాంటివి అమలు చేస్తామని మంత్రులు చెబుతున్నారు.