వరంగల్: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోని కోడెలను అక్రమంగా విక్రయించినట్లు వచ్చిన వార్తల్లో నిజంలేదని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయశాఖల మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే రీతిలో కుట్రపూరితంగా దుష్ప్రచారం జరిగిందంటూ, ప్రచారంలో ఉన్న వార్తలను ఖండించారు.
నిర్వహణ భారం... పంపిణీ కోసం కమిటీ
గత ప్రభుత్వ హయాంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు సమర్పించిన కోడెల సంఖ్య పెరుగుతుండటంతో కోడెల నిర్వహణ భారంగా మారి చాలా కోడెలు మరణించిన విషయాన్ని మంత్రి కొండా సురేఖ గుర్తు చేశారు. ఈ క్రమంలో భక్తుల విన్నపాల మేరకు మొక్కుల రూపంలో భక్తులు సమర్పించిన కోడెల నిర్వహణ నిమిత్తం విధివిధానాలను రూపొందించేందుకు ఆరు నెలల క్రితం మే నెలలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, వేములవాడ ఆలయ ఈవో కన్వీనర్ గా, పలువురు ఇతర సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటి మార్గదర్శకాలను రూపొందించినట్లు మంత్రి సురేఖ స్పష్టం చేశారు. ఈ మేరకు జీవో విడుదల చేసిన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు.
రైతుకు రెండు కోడెలు మాత్రమే..
ఈ మార్గదర్శకాల ప్రకారం పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్, సంబంధిత మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ధ్రువీకరణ పత్రం వుంటేనే పంపిణీ చేస్తున్నట్లు మంత్రి సురేఖ గుర్తు చేశారు. ధ్రువీకరణ పత్రాలు నిబంధనలకు అనుగుణంగా వుంటేనే ఒక రైతుకు రెండు కోడెల చొప్పున మాత్రమే ఇస్తున్న విషయాన్ని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కోడెల సంరక్షణ కోసం గోశాలలో సిసి ఫ్లోరింగ్, సరిపడా షెడ్లు, తాగునీటి వసతి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు మంత్రి సురేఖ వివరించారు. మూగజీవాల పై తమ ప్రభుత్వానికున్న శ్రద్ధ అటువంటిది అన్నారు. ఎంతో నిబద్ధతతో గోశాలల నిర్వహణ, గోవుల సంరక్షణను చేపడుతున్న పరిస్థితుల్లో కోడెలను అక్రమంగా విక్రయించారని వచ్చిన వదంతులను మంత్రి కొండా సురేఖ కొట్టి పారేశారు.
Also Read: Telangana Talli Statue: తెలంగాణ తల్లి రూపం మార్చడంపై హైకోర్టులో పిటిషన్, తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ!
నిబంధనల ప్రకారం కోడెల పంపిణీ
సాధారణంగా తన వద్దకు వచ్చే దరఖాస్తులను పరిశీలించాలని సంబంధింత అధికారులకు సూచిస్తుంటామని, కోడెల పంపిణీకి సంబంధించి వచ్చిన దరఖాస్తులను అదే విధంగా పంపించామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. దేవస్థానం అధికారులు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే రైతులకు కోడెలను పంపిణీ చేసారని మంత్రి పునరుద్ఘాటించారు. ఇందులో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు జరగలేదని మంత్రి కొండా సురేఖ తేల్చి చెప్పారు.
వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానంలోని ప్రతి కోడెకు శాశ్వతమైన ట్యాగ్ వుంటుందని, అటువంటి ట్యాగ్ లున్న కోడెలు ఎక్కడా పట్టుబడలేదని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి నిజానిజాలను వెల్లడిస్తూ నిన్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన ఈవో స్పష్టతనిచ్చిన విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు. ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నదని అవాస్తవ ప్రచారం చేస్తూ, సమాజంలో అశాంతిని సృష్టించే అసాంఘిక శక్తులను వెలికితీసి, చట్టపరంగా చర్యలు చేపడతామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.