Indiramma Illu Scheme Start Date: కాంగ్రెస్ పార్టీ గత శాసన సభ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒకటి ఇందరిమ్మ ఇళ్లు. ఆ గ్యారంటీని నిలబెట్టుకొనే దిశగా రేవంత్ సర్కార్ సన్నాహాలు ప్రారంభించింది. రానున్న బడ్జెట్‌లో ఈ మేరకు నిధులు కేటాయించనుంది. ఇవాళ్టి నుంచే లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక చేసేందుకు ప్రత్యేక యాప్ సీఎం ప్రారంభించారు. ఈ యాప్ ద్వారానే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ఇళ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం సొంత స్థలంలో  ఇళ్లు నిర్మించుకునేందుకు ఐదు లక్షల ఆర్థిక సాయం చేయనుంది. 


ప్రత్యేక యాప్‌లో ఏం నమోదు చేయాలి ?
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఏ గ్రామంలో లేదా పట్టణంలో నివాసం ఉంటున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి  నివాసం ఉంటున్నారు. లబ్ధిదారుడు వికలాంగుడా, వితంతువులు, ఒంటరి మహిళలు, ట్రాన్సెంజడర్లు, అనాథలు,  పారిశుధ్య కార్మికులు ఏ విభాగంలో ఉన్నారు. లాంటి వివరాలు యాప్‌లో పొందుపరచాలి. ఈ విభాగాల్లో ఉన్నవారికి ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యం ఉంటుంది. 


లబ్ధిదారుడికి ఇళ్లు నిర్మించుకోవడానికి అసలు సొంత భూమి ఉందా లేదా, ఉంటే ఎంత అందుబాటులో ఉంది. అనేది కూడా చెప్పాలి. దరఖాస్తు చేసిన లబ్ధిదారుడి పేరు మీద స్థలం ఉందా లేదా వారి కుటుంబ సభ్యుల పేరు మీద ఉందా? ప్రస్తుతం లబ్ధిదారుడు నివసిస్తున్న ఇంటి స్వరూపం ఎలా ఉందన్న వివరాలు నమోదు చేయాలి. లబ్ధిదారుని ఇంట్లో వివాహం చేసుకున్న జంటలు ఎంత మంది నివాసం ఉంటున్నారో చెప్పాలి. 


ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులు కీలకం.
ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్లను ఆధారంగా లబ్ధిదారుల ఎంపికకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రజాపాలనలో 80,54,554 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో రేషన్ కార్డుల సమాచారంతో సరిపోలిన దరఖాస్తులు 53,95,424.  ఇందులో 12, 72,019  దరఖాస్తుదారులు గతంలో లబ్ధిపొందినట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ప్రభుత్వం గతంలో మంజూరు చేసిన ఇళ్ల పథకాల ద్వారా లబ్ధి పొందని వారు 41,23,405 మందిగా తేల్చారు. 


ఎంపికలో ఈ అధికారులే కీలకం.
ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికలో అనర్హులకు చోటు లేకుండా ప్రభుత్వం  ఏర్పాట్లు చేసింది.  ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ఎంపికైన లబ్ధిదారులు తమ వివరాలను యాప్‌లో పొందుపర్చాల్సి ఉంది. ఆ తర్వాత సర్వే నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీల్లో కార్యదర్శి, పట్టణాల్లో వార్డు అధికారి ప్రత్యేక యాప్‌లో ఆ వివరాలు అప్‌లోడ్ చేస్తారు.  వీటిపై ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు మరోసారి పరిశీలించి అనర్హులకు ఇళ్లు దక్కకుండా పర్యవేక్షిస్తారు.


లబ్ధిదారుల ఎంపికలో సాంకేతికత వినియోగం
అర్హులైన వారికే ఇందిరమ్మ ఇళ్లు దక్కేందుకు ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ను వినియోగించనుంది. ఇందులో లబ్ధిదారుల ముఖాన్ని గుర్తించే టెక్నాలజీని వినియోగిస్తారు. లబ్ధిదారుడు అసలైన వ్యక్తేనా , కాదా, దరఖాస్తుదారుడా కాదా అన్న గుర్తింపు కోసం ఈ ఏఐ టెక్నాలిజీని వాడతారు. అంతే కాకుండా అతని ఇంటి స్వరూపం గుడిసెనా, రేకుల షెడ్డా, ప్లాస్టిక్ కవరింగ్ ఇళ్లా ఇలా ప్రస్తుతం వారు ఉంటున్న ఇంటి స్వరూపం. వారి స్థలానికు సంబంధించి ల్యాండ్‌ కో ఆర్డినేట్స్ అన్నీ ఏఐ ద్వారా గుర్తించి రికార్డు చేస్తారు.  ఇళ్లు మంజూరుయిన తర్వాత నిర్మాణ దశలు, పూర్తైందా లేదా అన్న వివరాల కోసం కూడా ఈ టెక్నాలజీనే వాడనున్నారు. అంతే కాకుండా లబ్ధిదారుడికి డబ్బులు ఖాతాలో వేసేందుకు కూడా ఏఐ టెక్నాలజీని వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


మూడు డిజైన్లలో ఇళ్లు...
ప్రత్యేక యాప్‌తోపాటు ప్రభుత్వం మూడు డిజైన్లలో ఇళ్లను నిర్మించింది. తక్కువ ప్లెస్‌లో కూడా కట్టుకునేలా రెండు గదులు, ఒక వంట గది,  బాత్రుం ఉండేలా ఈ మూడు డిజైన్లు ఉంటాయి. ఇంటి నిర్మాణానికి కనీసం 400 చదరపు గజాల స్థలం ఉండాల్సి ఉంది. ఇంత కంటే ఎక్కువ స్థలం ఉంటే ప్రభుత్వం ఇచ్చే డబ్బులతోపాటు వారు మరి కొంత డబ్బులు కలపుకుని వారికి నచ్చిన రీతిలో ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు. అయితే రెండు గదులు, వంట గది, బాత్రూం తప్పక ఉండాలి.  ప్రభుత్వం డిజైన్ చేసిన ప్రకారం ప్రతీ మండలంలో ఓ ఇంటి నిర్మాణం చేసి ప్రజలు చూసేందుకు వీలుగా ఉండాలని అధికారులు నిర్ణయించారు. ఇలా మూడు డిజైన్లలో ఇళ్ల నిర్మాణం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ ప్రకారమే తప్పనిసరిగా నిర్మించుకోవాల్సిన అవసరం లేదు.


తొలి విడతలో ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు.
రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లను తొలి విడతగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు అందించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.


 అనర్హుల గుర్తింపు ఇలా...
 అనర్హుల గుర్తింపులో యాప్ కీలకం. పన్నులు కట్టే వారు, వ్యవసాయ యంత్ర పరికరాలు ఉన్నావారు,  కారు వంటి వాహనాలు ఉన్న వారు, ప్రభుత్వ ఉద్యోగులు, గతంలో ఇళ్ల పథకం ద్వారా ఇప్పటికే లబ్ధి పొందిన వారు అనర్హులు. ఎంపిక సందర్భంగా ఆ వివరాలన్నీ లోతుగా పరిశీలించి తీసుకుంటారు. లబ్ధిదారుల ఎంపిక అయిన తర్వాత 360 డిగ్రీ లో అన్ని వివరాలను క్రోడకరించి పరిశీలిస్తారు. 


Also Read: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత