కర్ణాటకలోనే కాదు తెలంగాణలో కూడా గెలిచేది బీజేపీ పార్టీనే అని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల పాల్గొన్నారు. గుల్బర్గా జిల్లా సెడెం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి రాజ్ కుమార్ పాటిల్ తరపున ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో కలిసి సులేపేట్ లో కోలిసమాజ్ సమావేశంలో ఈటల ప్రసంగించారు. ఈ నియోజకవర్గం మొదట్లో హైదరాబాద్ సంస్థాన్ లో ఉంది. మనం ఇరుగు పొరుగు వారం. మన సాంప్రదాయాలు ఒక్కటే అని ఆయన అన్నారు.
దాదాపు 10 ఏళ్లుగా మా దగ్గర డబ్బు, దౌర్జన్యంతో పాలన జరుగుతుంది. ఆత్మగౌరవం కుంటుబడుతుంది. బీజేపీనీ గెలిపించి కుటుంబపాలనకు అంతం చేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కర్ణాటకలోనే కాదు తెలంగాణలో కూడా బీజేపీ గెలుస్తుందని దీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో మే 10 వ తేదీన గతసారి లాగా ఈ సారి కూడా బీజేపీని గెలిపించాలని కర్ణాటక ఓటర్లకు ఈటల పిలుపునిచ్చారు.
వ్యవసాయం సరిగా లేక కందులు, జొన్నలకే పరిమితం అయిన రైతులకు.. కాగ్నా నది మీద చెక్ డ్యాం నిర్మాణం జరుగుతుంది. దీంతో ఈ ప్రాంతం సస్యశ్యామలం కాబోతుంది. రెండూ సర్కర్లతో అభివృద్ధి మరింత వేగవంతం కానుంది. కాంగ్రెస్ 50 ఏళ్లు పాలించినా ఒరిగింది ఏమీ లేదన్నారు. ఎస్సీ 15% రిజర్వేషన్ నుండి జనాభా ప్రకారం 17% రిజర్వేషన్లు అమలు చేశారు.
ట్రైబల్ 3 % నుండి 7 % పెంచింది బీజేపీ అని ఈటల గుర్తుచేశారు. ముదిరాజ్ సమాజ్.. కోలి సమాజ్.. ఇక్కడ 60 లక్షల జనాభా ఉంది. వారు బీసీ ఏ నుండి ఎస్సీ లేదా ఎస్టీ లో చేర్చాలని డిమాండ్ ఉంది. అది చేయగలిగే సత్తా ఒక్క బీజేపీకే ఉందన్నారు. నరేంద్ర మోదీ పాలనలో భారత కీర్తి పతాక ప్రపంచ పటం మీద ఎరుగుతుంది. మా పాలనలో స్కాంలు లేవు. భారత్ ను విశ్వగురువు చేయడమే ప్రధాని మోదీ లక్ష్యం. పువ్వు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టండి. రాజ్ కుమార్ పాటిల్ ను గెలిపించండి అని ఈటల రాజేందర్ అక్కడి ఓటర్లను కోరారు.
ఏబీపీ సీఓటర్ ఒపీనియన్ పోల్ లో ఆసక్తికర విషయాలు
మరో నాలుగు రోజుల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కర్ణాటక ఎన్నికలపై అందరి ఆసక్తి పెరిగింది. మరి ప్రజాభిప్రాయం ఎలా ఉంది..? కన్నడిగులు కాంగ్రెస్‌కు పట్టం కడతారా..? లేదంటే బీజేపీకే సపోర్ట్ చేస్తారా..? దీనిపైనే ABP CVoter Opinion Pollలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 నియోజకవర్గాలున్నాయి. 113 సీట్లు నెగ్గే పార్టీ, లేక కూటమి అధికారంలోకి వస్తుంది. ABP CVoter Opinion Poll తాజా సర్వే ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీకి కనిష్టంగా 73 సీట్లు, గరిష్టంగా 85 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కనిష్టంగా 110 సీట్లు, గరిష్టంగా 122 సీట్లు కైవసం చేసుకుని అధికారంలోకి రానుంది. జేడీఎస్ పార్టీ 21 నుంచి 29 సీట్లు నెగ్గనుండగా, ఇతరులు 2 నుంచి 6 స్థానాల్లో గెలుపొందనున్నారని తాజా సర్వేలో తేలింది.