Special Flight From Imphal To Hyderabad: హైద్రాబాద్: మణిపూర్‌లో నెలకొన్న శాంతిభద్రతల సమస్యతో అక్కడ ఉన్న తెలంగాణ విద్యార్థులు, నివసిస్తున్న ప్రజల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. మణిపూర్ రాష్ట్రంలోని పరిస్థితిని పర్యవేక్షించడానికి, మణిపూర్‌లోని తెలంగాణ ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రత్యేక సెల్ తెరిచారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 250 మంది విద్యార్థులు ఇంఫాల్ మరియు పరిసర ప్రాంతాల్లోని వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్నారు. తెలంగాణ విద్యార్థులను ఇంఫాల్ నుంచి హైదరాబాద్‌కు తక్షణమే ప్రత్యేక విమానంలో తరలించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందు కోసం ఆదివారం (07-05-2023) ఉదయం ఇంఫాల్ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. ఇంఫాల్ నుండి హైదరాబాద్‌కు తెలంగాణ విద్యార్థులు సురక్షితంగా తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మణిపూర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సంప్రదించి చర్యలు తీసుకుంటున్నారు. మణిపూర్ రాష్ట్రంలోని తెలంగాణా ప్రజలు/విద్యార్థుల భద్రత కోసం మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు.
తెలంగాణ పౌరులను క్షేమంగా సొంత ప్రాంతానికి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. డీఐజీ బి సుమతిని హెల్ప్ లైన్ ఇంచార్జీగా నియమించినట్లు డీజీపీ అంజనీకుమార్ వెల్లడించారు. హెల్ప్ లైన్ నంబర్ 7901643283 నంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవడం గానీ, సహాయం కోరవచ్చునని ఆయన సూచించారు.
మణిపూర్ లో హింసాత్మక పరిస్థితులతో ఢిల్లీలోని ఏపీ భవన్‌లో సీఎం జగన్ ప్రభుత్వం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. మణిపూర్‌లోని రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు ఏదైనా సహాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యూఢిల్లీలోని AP భవన్‌లో హెల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు చేస్తూ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. హెల్ప్‌లైన్ నంబర్లు 011-23384016, 011-23387089
మణిపూర్ హింసలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు చిక్కుకున్నారు. తెలుగు విద్యార్థులు ఇంఫాల్ ఎన్ఐటీ సహా వేర్వేరు విద్యాసంస్థల్లో చదువుతున్నారు. హింస, కర్ఫ్యూ, కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులతో జనజీవనం స్తంభించింది. విద్యార్థులు హాస్టల్ గదులు, అద్దె గదుల్లో ఆహారం లేక అలమటిస్తున్నారని తెలుగు ప్రభుత్వాలు అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయి.
సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆర్మీ, అస్సాం రైఫిల్స్ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంఫాల్ నుంచి కోల్‌కత్తాకు ఇండిగో అదనపు విమాన సర్వీసులు నడుపుతోంది. మణిపూర్ నుంచి ఇతర రాష్ట్రాల విద్యార్థులను తరలించే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు
సహాయాన్ని అందించడానికి మణిపూర్ ప్రభుత్వం, స్థానిక అధికారులతో టచ్‌లో ఉన్నామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. మణిపూర్ రాష్ట్రంలోని ప్రస్తుత శాంతిభద్రతల పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నవారికి సహాయం అందించడానికి ఈ హెల్ప్‌లైన్ నంబర్‌లను ఏర్పాటుచేశారు.
1. 8399882392 - ఎంఎన్ మైఖేల్ అకోమ్, IRS
2. 9436034077 - రెహనుద్దీన్ చౌదరి, జాయింట్ సెక్రటరీ (హోమ్)
3. 7005257760 - పీటర్ సలాం, జాయింట్ సెక్రటరీ (హోమ్)
4. 8794475406 - డాక్టర్ టీహెచ్. చరణ్‌జీత్ సింగ్, జాయింట్ సెక్రటరీ (హోం)
5. 8730931414 - డా. మయెంగ్‌బామ్ వీటో సింగ్, డిప్యూటీ సెక్రటరీ (హోమ్)
6. 7085517602 - ఎస్. రుద్రనారాయణ సింగ్, డీఎస్పీ (హోమ్)
మణిపూర్‌లో తమ పిల్లలు, విద్యార్థులు ఉన్నట్లయితే వారి తల్లిదండ్రులు న్యూ ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్‌లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అదే విధంగా మణిపూర్ లో ఉన్న తమ పిల్లలకు సహాయం గురించి కోరవచ్చు అని ఓ ప్రకటనలో తెలిపారు. ఇంఫాల్‌లో, లేక న్యూఢిల్లీలో AP భవన్ హెల్ప్‌లైన్ ద్వారా సంప్రదించి, వారికి అవసరమైన ఏదైనా సహాయం కోరాల్సిందిగా విద్యార్థులకు సూచించారు.