తెలంగాణలో రెండవ సుందర నగరంగా కరీంనగర్ రూపుదిద్దుకుంటుందనీ, సీఎం కేసీఆర్ ఆశయాలు, ఆకాంక్షల మేరకు కరీంనగర్ ను సుందరంగా, స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ పట్టణంలో అభివృద్ధి పనులపై కలెక్టరేట్ లో అధికారులు ప్రజా ప్రతినిధులతో మంత్రి మంగళవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కరీంనగర్ లో జరుగుతున్న అభివృద్ధి పనుల తీరు పై ఆరా తీశారు. ప్రధానంగా నగరంలోని రోడ్లు, ట్రాఫిక్... ఐలాండ్ ల పై సుదీర్ఘంగా చర్చించారు. అలాకాని పక్షంలో టెండర్ రద్దు చేయండితెలంగాణ చౌక్... వన్ టౌన్ ల వద్ద ఐలాండ్ ల కోసం తవ్వి అలాగే వదిలేయడం పట్ల మంత్రి గంగుల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసి, త్వరితగతిన పనులు పూర్తి చేస్తే ఫర్వాలేదని, లేనిచో టెండర్ రద్దు చేసే ఆలోచన చేయాలంటూ అధికారులకు సూచించారు. అనంతరం నగరంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్, తెలంగాణ చౌక్... బొమ్మకల్ జంక్షన్లతో పాటు 13 కూడళ్ళ పనులను ఈ రోజు నుండే ప్రారంభించి మార్చి 31 లోగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావించిన తర్వాత అభివృద్ధిపై అందరు భయపడ్డారని కానీ వారి భయాన్ని పటాపంచలు చేస్తూ తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో నేడు కరీంనగరాన్ని గొప్ప నగరంగా తీర్చిదిద్ద గలిగామన్నారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కర్ణన్, అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి- హరి శంకర్... మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.