ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ప్రముఖ పుణ్యక్షేత్రం. కేవలం తెలంగాణ నుండే కాకుండా ముఖ్యమైన పండుగల సందర్భాలతో బాటు మామూలు రోజుల్లోనూ మొక్కులు చెల్లించుకోవడం కోసం భక్తులు చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కుటుంబ సభ్యులతో సహా వస్తూ ఉంటారు. పట్టణానికి దూరంగా వెలసిన పుణ్యక్షేత్రం కావడంతో ఇక్కడ అద్దె గదులు, లాడ్జ్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంటుంది. 


చాలామంది అక్కడ తాత్కాలిక గదులను నిర్మించి కూడా అద్దెకు ఇస్తున్నారు. ఇలాంటి వాటికి అసలు కనీస సౌకర్యాలు కూడా ఉండవు. రద్దీ కారణంగా భక్తులు దిక్కులేని పరిస్థితిలో వీటిలో ఆశ్రయం పొందుతారు. ఇక కేవలం నాలుగైదు లాడ్జిలకు తప్ప మిగతా వారికి ఎలాంటి అనుమతులు లేవు. ఇక అక్కడ స్థలాలు కొనుగోలు చేసి నూతనంగా బిల్డింగులు కట్టినవారు సంవత్సరాల చొప్పున లీజుకు ఇస్తున్నారు. రూ.2 నుండి 5 లక్షల వరకు వార్షిక కిరాయితో వారు అద్దె గదులు, లాడ్జి నడుపుకునేవారికి లీజుపై ఇస్తున్నారు. 


ఇక్కడే మొదలవుతుంది అసలు సమస్య. వీరిపై ఎలాంటి నియంత్రణ ఉండదు. పండగ సమయాల్లో రోజువారి అద్దెకు భక్తులకు ఇచ్చే ఈ లీజుదారులు మామూలు సమయాల్లో మాత్రం వీటిని అసాంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. పండగల సమయంలో మాత్రమే భద్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మామూలు సమయాల్లో వ్యభిచారం నిర్వహించే వారికి గంటకి వెయ్యి రూపాయల చొప్పున డిమాండ్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నో నేరాలకు అడ్డాగా మారిన కొండగట్టు చుట్టుపక్కల ప్రాంతాలను కవర్ చేసే విధంగా సీసీటీవీ కెమెరాలు పెట్టాలంటూ గతంలోనే పోలీసులు పలుమార్లు హెచ్చరించినా యజమానులు మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. 


కింది స్థాయి సిబ్బందిని మేనేజ్ చేస్తే సరిపోతుంది అనే ఆలోచనతో వారు ఉన్నారు. కొన్ని నెలల కిందట కుటుంబంలోని వ్యక్తిని తోటి కుటుంబ సభ్యులే దారుణంగా హతమార్చారు. వారు రోజుల తరబడి అక్కడ నివాసం ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. పైగా వారికి సంబంధించిన ఎలాంటి ఆధార్ కార్డు గానీ ఇతర గుర్తింపు కార్డు కానీ లేకపోవడంతో నిందితులలో ఇద్దరు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. ఇక వేములవాడ లాంటి ప్రాంతాల్లో నిఘా పెరగడంతో కొండగట్టు లాంటి ఐసోలేటెడ్ క్షేత్రాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఎంతో భక్తితో సుదూర ప్రాంతాల నుండి వచ్చే వారు ఇలాంటి కార్యకలాపాలు జరగడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి డబ్బులే పరమావధిగా లాడ్జి యజమానులు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు సమన్వయంతో వ్యవహరించి పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు.