Karimnagar News: హైదరాబాదులో వరుసగా గంజాయి ఇతర డ్రగ్స్ కేసులు వెలువడుతున్న తరుణంలో తెలంగాణలోని కరీంనగర్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కువగా హైదరాబాదు లాంటి ప్రాంతాలకు సరఫరా చేసే వాళ్లే కరీంనగర్‌కు కూడా పెద్ద మొత్తంలో గంజాయిని సరఫరా చేస్తూ ఉంటారు. అయితే వారు సాధారణంగా వాడే రైలు మార్గంలో రవాణా కరీంనగర్‌కు కొంతవరకు అనుకూలం కాదు. దీంతో ఇతర మార్గాల ద్వారా కరీంనగర్ కు చేరవేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ మధ్య ఇలాగే వరుసగా భారీ ఎత్తున గంజాయి పట్టుబడుతూ ఉండడంతో కరీంనగర్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ వ్యసనం గ్రామ గ్రామాలకు విస్తరిస్తుండటంతో ముందే పూర్తిస్థాయిలో పోలీసు శాఖలోని అన్ని డివిజన్లకు అలెర్ట్ మెసేజ్ ఇచ్చారు.


పోలీసులకు దొరక్కుండా చిత్రవిచిత్రమైన అడ్డాలు...
పోలీసులు గంజాయిపై ఉక్కుపాదం మోపుతుండడంతో దానికి బానిసలైన యువకులు అటు టెక్నాలజీతో పాటు అనూహ్య ప్రదేశాలు సెలెక్ట్ చేసుకుని అక్కడ గంజాయిని సేవిస్తున్నారు. గతంలో కరీంనగర్ రూరల్ మండలంలోని ఒక ప్రదేశంలో చెట్టుపై గూడు కట్టుకొని మరి గంజాయ్ కి అలవాటు పడ్డారు కొందరు యువత. వారంతా కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి చెట్టుపై చిన్నపాటి ఇల్లు నిర్మించారు. ఇక్కడే తమ వద్ద ఉన్న గంజాయిని అక్కడికి వచ్చే తమ మిత్రబృందానికి సరఫరా చేసేవారు. అసలు కొన్ని నెలల పాటు ఎవరికీ అనుమానం రాలేదు కానీ ఓ రోజున అక్కడ గంజాయి సేవించిన ఓ యువకుడు పోలీసులకు పట్టుబడటంతో ఆ అడ్డాని చూపించాడు. దీంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. ఇక అసంపూర్తిగా , ఖాళీగా ఉండే ఇండ్లు, నిర్మానుష్య ప్రదేశాలు, కాస్త అడవి ఉన్న ప్రాంతాల్లో రహస్య స్థలాన్ని ఏర్పాటు చేసుకొని తమ ఫ్రెండ్స్ ని ఆహ్వానించడం మొదలుపెట్టారు. దీంతో ఈ సారి పోలీసులు అలాంటి ప్రత్యేక ప్రదేశాలపై కూడా నిఘా పెంచారు.


ఇక్కడికి రవాణా అసలు సమస్య
నిజానికి కరీంనగర్ కి విస్తృతమైన రైల్వే వ్యవస్థ లేదు. సాధారణంగా గంజాయి ఎక్కువగా రైల్వేల ద్వారానే తీసుకొని వస్తుంటారు విక్రేతలు, స్మగ్లర్లు. అలాంటి సౌకర్యం కరీంనగర్‌కు లేకపోవడంతో ప్రత్యేకంగా జమ్మికుంట లాంటి బార్డర్ రైల్వే స్టేషన్ లని ఎంపిక చేసుకొని మరి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇక అక్కడి నుండి ఖరీదైన కార్లలో తరలించడం ద్వారా పోలీసుల కళ్లుగప్పి గుట్టుగా  తరలిస్తున్నారు.


స్మగ్లర్‌గా మారిన టీచర్
ఈ మధ్య మహారాష్ట్ర పోలీసులకు మంథనికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు భారీ ఎత్తున గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. తక్కువ సమయంలోనే లక్షలు సంపాదించాలనే కోరిక ఉన్న వారిని తమకి అనుకూలంగా మలుచుకుంటున్నారు ఉత్పత్తిదారులు. గతంలో ఏ నేర చరిత్ర లేకుండా కొత్తగా వచ్చిన వారితో స్మగ్లింగ్ చేయడం ద్వారా పోలీసుల నుండి తప్పించుకోవచ్చని ప్లాన్స్ వేస్తున్నారు. ఇలాంటి వారిపై కూడా పోలీసులు నిఘా పెంచారు.


నేటి వినియోగదారుడే రేపటి విక్రేత...
గంజాయితో వచ్చిన సమస్య ఏంటంటే ఒక స్థాయి వరకు డబ్బులు పెట్టి కొనగలిగిన వారు ఆ తరువాత స్మగ్లర్లు గా మారుతున్నారు లేదా తమ ఖర్చులు వెళ్లిపోయేలా విక్రేతలా మారుతున్నారు. కొత్త కొత్త వారికి అలవాటు చేసి ఈ వ్యసనాన్ని విస్తృతం చేస్తున్నారు. అందుకే మొదట్లోనే పరిస్థితిని కంట్రోల్ చేయడానికి సిద్ధం అయ్యారు కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు.