సాయంత్రం 6 దాటితే చీకటిగా మారుతుండగా వీధుల్లో దీపాలు వెలిగినట్లే వెలిగి ఆరిపోతున్నాయి. ఒకటి,రెండు డివిజన్లు కాదు ఈ సమస్య అన్ని చోట్ల ఎదురవుతున్నట్లు పాలకవర్గ సభ్యులు చెబుతున్నారు.. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో 60 డివిజన్లు ఉండగా ఆయా ప్రాంతాల్లో రాత్రి వేళలో చీకటిగా ఉండకుండా స్తంభానికి ఒక వీధి లైటు ఏర్పాటు చేశారు. ప్రతి వీధిలో పాతిక సంఖ్యలో ఉన్నాయి. స్తంభాలకు అధిక వెలుతురు వచ్చే ఎల్ఈడి లైట్లు ఉండగా... సాంకేతిక పరంగా సమస్యలు రాకుండా వీటిని బిగించారు. వెలగకపోవడంతో ఫిర్యాదుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. సమయపాలన పాటించడం లేదంటూ శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో పలువురు కార్పోరేటర్లు, నగర మేయర్ వై.సునీల్ రావు, కమిషనర్ సేవా ఇస్లావత్ దృష్టికి తీసుకువచ్చారు. 
నగరంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి వీధిలైట్ల సీసీఎంఎస్ డబ్బాలతో విద్యుత్ సరఫరా లో వస్తున్న హెచ్చు తగ్గులతో వాటికి అవే వీధి దీపాలు వెలగడం లేదు. ఒకసారి నిలిచిపోతే, మళ్ళీ సిబ్బంది వచ్చి వేసే వరకు ఇలాగే చీకటిగా ఉంటుంది.అదే విధంగా చెట్ల కొమ్మలు తగిలినా లైన్ ఫాల్ట్ వచ్చినా కొన్ని ప్రాంతాల్లో లైట్లు వెలిగి బంద్ అవుతున్నాయి. నెల రోజులలో మంకమ్మతోటలోని సెంట్రల్ లైటింగ్, జ్యోతి నగర్, చైతన్యపురి, కట్టరాంపూర్ లోని వినాయక నగర్, సప్తగిరి కాలనీ తదితర ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి.


నిర్వహణలో అలసత్వం..
ఈఈఎస్ఎల్ ఆధ్వర్యంలో వీధి దీపాల నిర్వహణ.. పర్యవేక్షణ చేస్తుండగా...ఎల్ఈడి లైట్లకు సంబంధించిన విడిభాగల కొరత ఇబ్బందిగా మారింది. సిసిఎంఎస్ లేకపోతే ఉన్న బాక్సులు పాత పాడడం తరచుగా మరమ్మతులు చేయాల్సి రావడంతో ఇబ్బందులు వస్తున్నట్లు సమాచారం. గతంలో ఉన్న సామాగ్రి ఒక కంపెనీవి కాకుండా రెండు రకాల కంపెనీల నుంచి వచ్చాయి. ఇందులో 160 వరకు అలాగే ఉన్నాయి. వేర్వేరు డైవర్స్ ఉండడంతో ఏ లైట్ ఏ కంపెనీదో తెలియక కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. ఏ కాలానికి సంబంధించిన సమయాన్ని ఆ కాలానుగుణంగా లైట్లు వెలిగేలా టైమ్ మార్చుకోవాల్సి ఉంటుంది.దీని ఆపరేటింగ్ పూర్తిగా హైదరాబాదులో ఉండగా కరీంనగర్ నగర పరిధిలో ఉదయం సాయంత్రం ఆన్ ఆఫ్ సమయాల్లో తేడాలు వస్తున్నాయి. సాయంత్రం ఏడు గంటలకు లైట్లు వచ్చే ప్రాంతాలు కూడా ఉన్నాయని స్వయంగా కార్పొరేటర్లే అంటున్నారు. ఉదయం చాలా ప్రాంతాల్లో ఏడ్నుంచి ఎనిమిది గంటల వరకు వీధిలైట్లు వెలుగుతున్నాయి .వాటికి అవే వెలిగి బంద్ అయ్యేలా చూడాల్సి ఉండగా పట్టింపు లేకుండా ఉంటున్నాయి. 
రాత్రిపూట వీధి దీపం వెలగడం లేదని కార్పొరేటర్ లేదంటే స్థానికులు సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేస్తే తప్ప పరిష్కరించడం లేదు. రాత్రి 10 దాటితే ఆ లైటు వెలిగించే పరిస్థితి ఉండదు. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రత్యేకంగా కాల్ సెంటర్ లేకపోగా వీధివీపం వెలగడం లేదని సమాచారం ఇవ్వాలంటే ఎవరికి ఫోన్ చేయాలో తెలియని గందరగోళం నెలకొంది. స్మార్ట్ సిటీలో భాగంగా రహదారులకు 20 ఇటీవల ఏర్పాటు చేసిన వీధిలైట్లు పలు ప్రాంతాల్లో వెలగడం లేదు వీటిని నగరపాలిగకు అప్పగించకపోవడంతో నిర్వహణ ఆ సంస్థ చూడాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు. సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనకు వస్తున్నారని ఉద్దేశంతో బైపాస్ రోడ్డులో హడావుడిగా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. రోడ్డు కట్టింగ్ చేసి కేబుల్ వేయాల్సి ఉండగా తాత్కాలికంగా సర్వీస్ వైర్ తో లైట్లు వెలిగించారు. వైరింగ్ సమస్యతో లైట్లు సక్రమంగా వెలగకపోగా ఇప్పటికీ రోడ్డు మధ్యలో వేలాడుతోంది.