Karimnagar News: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో నగరానికి ఆనుకుని ఉన్న ఎనిమిది గ్రామాలను నగరంలో విలీనం చేశారు. ఆ ప్రాంత వాసుల్లో నగర శోభ సంతరించుకుంటుందని భావించగా... అనుకున్న స్థాయిలో అభివృద్ధి పనులు జరగడం లేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆస్తిపన్ను, నల్ల బిల్లులు, నిర్మాణ అనుమతుల పేరుతో బల్దియాకు ఆదాయం వస్తుండగా తాగునీరు, రహదారులు, మురికి నీటి కాలువలు, పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడం లేదని అంటున్నారు.

Continues below advertisement

స్థానిక ప్రజా ప్రతినిధులు మాత్రం ప్రజల ఇబ్బందులు కొంత వరకు దూరం చేసేందుకు నిర్ణయించినప్పటికీ అవి కొద్ది రోజులకు మాత్రమే పరిమితంగా మారుతుంది. పలు విలీన గ్రామాల్లోని సమస్యలపై ప్రజలు తెలుపుతున్నారు. సదాశివపల్లిలో పంచాయతీ హయాంలోనే వేసిన రోడ్లే కనిపిస్తున్నాయి. రేకుర్తి, హరిహరనగర్, విద్యానగర్, శివారు, సీతారాంపూర్, ఆరేపల్లి, తీగల గుట్టపల్లి, వలంపహాడ్, పద్మనగర్, అలుగునూర్ ప్రాంతాల్లో కొత్తగా రూటు వేయాలని కోరుతుండగా నిధుల లేకపోవడంతో సమస్యగా మారిందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. 

రోడ్లన్నీ నాశనమై.. కంకరపైకి తేలి!

Continues below advertisement

ఇన్ని సంవత్సరాలుగా ఇలాగే ఉండటం ఏంటని స్థానికులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. తీగల గుట్టపల్లి ప్రధాన రహదారిపై మురుగు నీరు రోడ్డుపైకి వస్తుండగా తాత్కాలికంగా పైపులైను వేశారు. సరస్వతి నగర్ లో ఇళ్ల పక్క నుంచే మురుగు నీరు ప్రవహిస్తోంది. ఈ నీరు వెళ్లేందుకు దారి లేకపోవడంతో కాలీ స్థలాల్లో నీరు నిలిచి చెడు వాసన వస్తోంది. పద్మానగర్, రేకుర్తి, సీతారాంపూర్, సూర్యనగర్, బాలాజీనగర్, హరిహరనగర్, అలుగునూర్ ప్రాంతాల్లో కచ్చా కాలువలు ఉన్నాయి. సదాశివ పల్లిలో డ్రైనేజీలు శిథిలం కాగా కనీసం ప్రతిపాదనలు కూడా చేయడం లేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కరీంనగర్ చొప్పదండి ప్రధాన రహదారి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న విలీన కాలనీ వల్లం పహాడ్ అంతర్గత తారు రోడ్డు పలుచోట్ల దెబ్బతింది. కంకర పైకి తేలి అధ్వానంగా మారగా కనీసం తాత్కాలిక చర్యలు కూడా చేపట్టడం లేదు. 

సీతారాంపూర్ కు వెళ్లే బైపాస్ రోడ్డు మరీ దారుణం!

తీగల గుట్టపల్లి ప్రాంతంలో విద్యుత్ సమస్య తీవ్రంగా మారింది. నగునూరు సబ్ స్టేషన్, అంబేద్కర్ నగర్ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా చేస్తుండగా ఓవర్ లోడ్ తో తరచుగా కరెంటు పోతుంది. సగం తీగలగుట్ట పల్లికి నగనూరు నుంచి వస్తుండటంతో తరచుగా అంతరాయం కలుగుతుంది. రాత్రిపూట అయితే గంటల తరబడి నిలుస్తోందని చెబుతున్నారు. కొత్త సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని విద్యుత్తు అధికారుల దృష్టికి తీసుకెళ్లామని కార్పొరేట్ కొలగాని శ్రీనివాస్ చెప్పారు. ప్రభుత్వ స్థలం ఉందని, తహసిల్దార్ ఆ స్థలాన్ని అప్పగించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు. పాలనాధికారి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

తీగల గుట్టపల్లి నుంచి సీతారాంపూర్ కు వెళ్లే బైపాస్ రోడ్డు దారుణంగా మారింది. భారీ వాహనాలు ఇటువైపు నుండే వెళ్తుండడంతో పలుచోట్ల గుంతలు పడి దుమ్ముమయంగా మారుతుంది. పలుమార్లు మట్టితో గుంతలు పూడ్చుతుండగా శాశ్వత పరిష్కారం చేయాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు. సరస్వతి నగర్ తోపాటు పలు వీధుల్లో ఇళ్ల మధ్యలో కచ్చా కాలువలు ఎక్కువగా ఉన్నాయి. వర్షం పడితే నీరంతా రోడ్ల పైకి ప్రవహిస్తోంది. ఒకటి రెండు చోట్ల కాదు అత్యధిక శాతం మురుగునీరు వెళ్లేదారి లేకుండా తయారైంది.