Karimnagar News: ఈ మద్య కాలంలో చాలా మంది రూపాయికే బిర్యానీ, 25 పైసలకే బిర్యానీ అంటూ తెగ ఆఫర్లు ఇస్తున్నారు. కొత్తగా హోటల్స్, రెస్టారెంట్లు ఓపెన్ చేసిన రోజు ఇలా చేస్తుంటారు. అయితే తాజాగా కరీంనగర్ లోనూ ఓ బిర్యానీ సెంటర్ యజమాని శుక్రవారం రూపాయి నోటుకు బిర్యానీ ఆఫర్ ప్రకటించారు. దీంతో విషయం తెలుసుకున్న చాలా మంది హోటల్ వద్దకు ఎగబడ్డారు. పెద్ద ఎత్తున జనాలు వెళ్లడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. తాము వచ్చిన వాహనాలు ఎక్కడ పెట్టాలో తెలియని ప్రజలు.. నడి రోడ్డుపై వదిలేసి హోటల్ ముందు బిర్యానీ కోసం వేచి చూశారు. దీంతో ట్రాపిక్ పోలీసులు.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపై వాహనాలు నిలపిన వారిపై కేసులు నమోదు చేశారు. 100 నుంచి 235 వరకు జరిమానాలు విధించారు.


అసలేం జరిగిందంటే..?


కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ సమీపంలో కొత్తగా ప్రారంభించిన ఒక బిర్యానీ సెంటర్ నిర్వాహకులు శుక్రవారం రూపాయి నోటు ఇచ్చిన వారికి బిర్యానీ ఇస్తామని ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేకంగా సమయాన్ని కూడా సూచించారు. ఈ విషయం సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడంతో జనం రూపాయి నోటుకు బిర్యానీ కోసం పెద్ద ఎత్తున ఎగబడ్డారు. అరగంటలోనే 800లకు పైగా బిర్యానీ ప్యాకెట్లను కొనుగోలు చేశారు. చాలా మందికి బిర్యానీ లభించకపోవడంతో హోటల్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ పోలీసులు వచ్చి బిర్యానీ సెంటర్ ను మూసి వేయించడంతో రోడ్ల మీద అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసిన వంద మంది వాహనాలకు 100 రూపాయల నుంచి 235 రూపాయల వరకు జరిమానా విధించారు. దీంతో కొందరు బిర్యానీ సెంటర్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 


రెండు నెలల క్రితం ఏపీలోనూ రూపాయికే బిర్యానీ


ప్రకాశం జిల్లా మార్కాపురంలో కొత్తగా ఓ హోటల్ ప్రారంభించారు. అయితే మొదటి రోజు కావడంతో అదిరిపోయే ఆఫర్ ప్రకటించి భోజన ప్రియులను టెంప్ట్ చేశారు. ఒక్క రూపాయి నోట్ ఉంటే చాలు చికెన్ బిర్యానీ పార్శిల్ తీసుకెళ్లొచ్చని ప్రకటించారు. అంతే ఇక రూపాయి నోట్ ఇచ్చి బిర్యానీ తీసుకెళ్లేందుకు మాసం ప్రియులు ఉదయం నుంచే హోటల్ ముందే క్యూ కట్టారు. రూపాయికే బిర్యానీ ఇస్తున్న విషయం తెలుకున్న మరి కొంత మంది నాణేలు పట్టుకొని రాగా.. నోటు ఇస్తేనే బిర్యానీ అని నిర్వాహకులు చెప్పారు. దీంతో పలువురు ఇళ్లకు వెళ్లిపోయారు. రూపాయి నోటు పట్టుకొని కూడా చాలా మందే హోటల్ కు రాగా... హోటల్ ఆవరణ ప్రాంతమంతా రద్దీగా మారింది. ఇప్పటికే మూడు వందల మంది వరకు వచ్చారని.. ఇంకా మూడు వందల మంది వచ్చినా ఇబ్బంది లేకుండా చికన్ బిర్యానీ అందిస్తామని హోటల్ నిర్వాహకులు తెలిపారు. దీంతో నోట్ ఉన్న వాళ్లంతా వెళ్లి ఎంచక్కా రుచికరమైన బిర్యానీని తెచ్చుకున్నారు. వందల సంఖ్యలో బిర్యానీ పార్సల్స్ ను తీసుకొని ఆనందంగా వెనుదిరిగారు చాలా మంది.