Karimnagar News: కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా సిటీలో ఆధునిక సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు మెరుగైన సేవలు అందించనున్నారు. 94.14 కోట్లతో రక్షణ, భద్రతా అంశాలకు కమాండ్ కంట్రోల్ సంస్థను ఏర్పాటు చేయనున్నారు. సీసీ కెమెరాలు ఫిక్స్ చేసే పనులు కొనసాగుతున్నాయి. కార్పొరేషన్ సేవలు ప్రధానంగా అందించడంతోపాటు ట్రాఫిక్, సిగ్నలింగ్ లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ప్రత్యేకంగా భవనం నిర్మిస్తుండగా పూర్తి పర్యవేక్షణ నిర్వహణ స్మార్ట్ సిటీతోనే కంట్రోల్ చేయనున్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్య పనుల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం నగర వ్యాప్తంగా చెత్త సేకరణ పాయింట్లు, డంపింగ్ యార్డులు, స్మార్ట్ డస్టుబిన్లు  ఉన్న ప్రాంతంలో మ్యాపింగ్ చేసే పనులు ప్రారంభించారు. 


నగరంలో ఉన్న 126 వాహనాలకు జీపీఎస్ అమలు..


నగరంలోని ప్రధాన రహదారులపై పారిశుద్ధ్య పనులు నిర్వహణను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. డంపింగ్ యార్డుకు అనుసంధానం చేసి ఏ ట్రాక్టర్ ఎంత వరకు చెత్తను తీసుకొస్తుందో నేరుగా వేబ్రిడ్జి ద్వారా లెక్కలు తెలుసుకుంటారు. రహదారులపై చెత్త చెదారం తరలించేందుకు కార్మికులకు హెచ్చరికలు చేసేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో వాణిజ్య ప్రాంతాల్లోని 7,892 షాపులకు క్యూఆర్ కోడ్ ద్వారా చెత్త సేకరణ తీరు గమనిస్తారు. నగరపాలక సంస్థలో మొత్తం 126 వాహనాలు ఉన్నాయి. వీటికి వెహికల్ ట్రాకింగ్ జీపీఎస్ విధానం అమలు చేస్తారు. ఏ ట్రాక్టర్, ఏ ట్యాంకర్ ఎక్కడికి వెళ్తుందనే విషయం అప్పుడే తెలుస్తోంది. పారిశుద్ధ్య విభాగంలో పని చేస్తున్న 30 వెహికల్స్ కు చివర సెన్సార్లు బిగించనున్నారు. డీజిల్ ఎంత మేర వాడుతున్నారు, ఏ ట్రాక్టర్ ఎంత డీజిల్ తీసుకుంటుందో తెలుస్తోంది. ఇంటింటా చెత్త సేకరణ ఎంత మేర జరుగుతుంది అనేది పరిశీలించుకోవచ్చు. 


స్మార్ట్ డస్ట్ బిన్ల ఏర్పాటు..


నగరంలోని పది ప్రాంతాల్లో స్మార్ట్ డస్ట్ బిన్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. అందులో ఎనిమిది స్థలాల్లో బిగించారు. చెత్త డబ్బా కు లాకింగ్ ఉంటుంది. చెత్త నిండితే కమాండ్ కంట్రోల్ కు సెన్సార్ ద్వారా అలారం తెలుపుతుంది. అప్పుడే అందులోని చెత్తను శుభ్రం చేస్తారు. నగరపాలక ద్వారా పౌర సేవలు వినియోగించుకోవడం కోసం ప్రత్యేకంగా మొబైల్ అప్లికేషన్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధిలైట్లు ఇతర సమస్యలు అందుబాటులో నమోదు చేయొచ్చు. అంతేకాకుండా ఆస్తి పన్ను, నల్ల బిల్లుల చెల్లింపులు, ఇతర రకాల పనులు మొబైల్ ద్వారా సులువుగా చెల్లించుకునేందుకు వీలు కల్పిస్తారు. కమాండ్ కంట్రోల్ వ్యవస్థను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకెళ్లేందుకు స్మార్ట్ సిటీ అధికారులు పనులు తొందరగా చేస్తున్నారని, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు అందుబాటులోకి తీసుకొచ్చేలా పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రధాన రహదారులపై కెమెరాల ఫిక్సింగ్ పనులు పూర్తి అయ్యాయి. వీటికి అనుసంధానం చేసేందుకు చర్యలు ముమ్మరం చేశారు. నగర వాసులకు ఉపయోగపడేలా కమాండ్ కంట్రోల్ అందుబాటులోకి తీసుకొచ్చి ఇంకా చాలా రకాల సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని నగర మేయర్ వై.సునీల్ రావు తెలిపారు.