Karimnagar News: ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాల కోసం అడుగులు వేస్తున్న ప్రభుత్వం ఇకపై మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో మాదిరిగా కచ్చితమైన ప్రణాళికతో క్రీడా ప్రణాళికను కూడా ప్రకటిస్తే బాగుంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం బడుల్లో సరైన శిక్షణ లేక విద్యార్థులు క్రీడల్లో వెనుకబడి పోతున్నారు. కొన్నిచోట్ల వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ.. క్రీడా వస్తువులు ఉండటం లేదు. ఫలితంగా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో నిరాశ ఎదురవుతుంది. స్కూళ్లకు సమయానికి నిధులు రాకపోవడం వల్ల విద్యార్థులు ఆటలకు దూరం కావలసి వస్తోంది. చాలా రోజుల తర్వాత సర్కారు బడులకు క్రీడానిధి పేరిట నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేరుగా పాఠశాలల యాజమాన్య కమిటీ ఖాతాలో జమవుతున్నాయి. ఈ నిధులతో ఆట వస్తువులు కొనుగోలు చేయాలని ఆదేశించారు.
ప్రాథమిక పాఠశాలలకు రూ.5 వేలు, ప్రాథమికోన్నత పాఠశాల, ఉన్నత పాఠశాలలకు రూ.10 వేల చొప్పున కేటాయించారు. నిధులు రావడంతో క్రీడ సామాగ్రి కొరత తీరనుంది. ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల నుంచి గతంలో క్రీడల నిర్వహణ రుసుము వసూలు చేసేవారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఈ రుసుము రద్దు అయింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలే పాఠశాలల్లో క్రీడల నిర్వహణకు నిధులను భరిస్తున్నాయి. దాదాపు 10 సంవత్సరాలుగా గేమ్స్ కోసం నిధులు లేకపోవడంతో ఆటలు మరుగున పడ్డాయి. పాఠశాల క్రీడా సమాఖ్యకు ఆదరణ కరువైంది. మండల స్థాయిలో పోటీలు నిర్వహించి అక్కడి నుంచి జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో పోటీలు ఏర్పాటు చేసే విద్యార్థుల టాలెంట్ ను వెలికి తీసేవారు. నిధులు లేక ఈ పోటీలు నామమాత్రంగా సాగుతున్నాయి. కొన్ని చోట్ల దాతలు సహకారంతో మాత్రమే నిర్వహిస్తున్నారు.
క్రీడా నిధులు లేక కొట్టుమిట్టాడుతున్న స్కూళ్లలో పది సంవత్సరాల నిరీక్షణకు తెర పడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 239 స్కూల్స్ ఉండగా, ఇందులో ప్రాథమిక స్కూళ్లు 1,532, ప్రాథమికోన్నత స్కూళ్లు 279, హై స్కూళ్లు 558 ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలకు రూ.5000 ప్రాథమికోన్నత పాఠశాల, ఉన్నత పాఠశాలలకు రూ.10 వేల చొప్పున మొత్తం 1.62 కోట్లు మంజూరు కావడంతో త్వరలో క్రీడా సామాగ్రి అందుబాటులోకి రానుంది. ఆటల్లో విద్యార్థుల ప్రతిభకు పదును పెట్టనున్నారు. ఈ విషయమై పెద్దపల్లి జిల్లా విద్యాధికారి మాధవితో మాట్లాడగా ఆటలతో మానసిక ప్రశాంతితో కలుగుతుందని అన్నారు. మంజూరైన క్రీడా నిధులు పాఠశాల యాజమాన్య కమిటీ ఖాతాల్లో జమవుతున్నాయని ఆ నిధులతో క్రీడ సామాగ్రి కొనుగోలు చేసుకోవాలని ఆదేశించామని చెప్పారు.
క్రీడల పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని అన్నారు. నిధులు లేక స్కూళ్లలో క్రీడా సామాగ్రి అందుబాటులో ఉండడం లేదు. తాజాగా మంజూరైన నిధులతో వాలీబాల్, ఫుట్బాల్, టెన్నిస్ బాల్, క్రికెట్ బ్యాట్లు, బాస్కెట్బాల్, షార్ట్ ఫుట్, జావెలింత్రో, స్కిప్పింగ్ రోప్స్, త్రో బాల్ సామాగ్రి కొనుగోలు చేశారు. ఫస్ట్ ఎయిడ్ కిట్స్ మరియు పిల్లలకు అవసరమైన ఆట వస్తువులు అందుబాటులో ఉంచుతారు. రెగ్యులర్ చదువులతో పాటు క్రీడల్లో రాణిస్తేనే పిల్లలు అటు శారీరకంగా ఇటు మానసికంగా ఎదుగుతారని నిపుణులు వెల్లడిస్తున్న నేపథ్యంలో మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై ప్రభుత్వాలు శ్రద్ధ వహించడం మంచిది.