Khammam News: ఖమ్మం పట్టణంలో దొంగ బాబా విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజల నమ్మకాలను ఆసరాగా చేసుకుంటూ కొంతమంది కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు సామాన్య ప్రజలను దోచుకున్న ఘటనలు మనం చాలానే చూశాం. కానీ ఓ రాజకీయ నాయకుడినే బోల్తా కొట్టించాడో దొంగబాబా. రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఓ పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడు ఇంట్లో చోరీ చేసి ఉడాయించాడు. విషయం గుర్తించిన సదరు రాజకీయ నాయకుడు పోలీసులకు సమాచారం అందించగా.. హుటాహుటిన రంగంలోకి దిగి సినిమాటిక్ స్టైల్లో వారిని చేస్ చేసి పోలీసులు పట్టుకున్నారు. 


5 తులాల బంగారంతో పాటు 35 వేల నగదు చోరీ


దొంగ స్వాములు పట్టణంలో నివాసం ఉంటున్న ఓ పార్టీ నాయకుని ఇంటికి చేరుకున్నారు. నీకు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉందని, కానీ అందు కోసం నీవు కొన్ని పూజలు చేస్తే కలిసి వస్తుందని నమ్మబలికాడు. చివరకు పూజ చేయకుండానే అతని ఇంట్లో నుంచి 5 తులాల బంగారం, 35వేల నగదుతో పరారయ్యాడు. దీంతో వెంటనే ఆ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. ఇక వెంటనే రంగంలోకి దిగిన ఖమ్మం టూ టౌన్ పోలీసులు… రెండు జిల్లాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారులో పారిపోతున్న దొంగ స్వాములను కొత్తగూడెం వన్ టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ దొంగ స్వాములు రాజస్థాన్ కు చెందిన వారిగా గుర్తించారు. కారులో ఉన్న ఇద్దరు స్వాముల్లో ఒకరు పరారు కాగా మరో స్వామి, కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కారులో గంజాయి కూడా లభ్యమైనట్లు సమాచారం. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు… వారిని విచారణ చేస్తున్నారు.


ఏడు నెలల క్రితం కరీంనగర్ లోనూ ఇలాంటి ఘటనే..


ఆశ మనిషిని ఎంతటి స్థితికైనా తీసుకెళ్తుంది. స్వయంకృషితో కష్టపడితే నలుగురు మెచ్చే మార్గంలో నిలబెడుతుంది. రాత్రికి రాత్రి లక్షాధికారి అయిపోవాలనుకుంటే మాత్రం ఇలా జరుగుతుంది. డబ్బు ఆశ చూపి లక్షల డబ్బుతో ఊడయించాడు ఓ దొంగబాబా. పూజలు చేస్తే డబ్బు రెండింతలవుతుందని హైదరాబాద్ కు చెందిన ఓ దొంగబాబా ముగ్గురు యువకులను నమ్మించాడు. బాబా మాయలో పడిన యువకులు అతడి మాటలు నమ్మి రూ.12 లక్షలు చేతిలో పెట్టారు. 


పూజలు చేసి వస్తానని చెప్పి పారిపోయిన బాబా..!


హైదరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా గంగాధార మండలానికి వచ్చిన ఓ యువకుడు ఓ బాబా గురించి చెప్పిన మాటలు నమ్మి ముగ్గురు యువకులు డబ్బులిచ్చారు. పూజలు చేస్తే రాత్రికి రాత్రి నగదు రెట్టింపు అవుతుందని దొంగబాబా చెప్పిన మాయమాటలు నమ్మి రూ.12 లక్షలు ఇచ్చారు. కొత్తపల్లికి చెందిన మధ్యవర్తితో హైదరాబాద్ వచ్చారు యువకులు. ఇంతలో పూజలు చేసి వస్తానని చెప్పిన దొంగబాబా డబ్బులతో పారిపోయాడు. దొంగ బాబా కోసం గాలించి చివరికి ఏం చెయ్యాలో తెలియక ఇంటికి చేరుకున్నారు బాధితులు. గంగధార, నమిలి కొండ, వేములవాడకు చెందిన వ్యాపారులు మోసపోయిన వారిలో ఉన్నారు.