Karimnagar News: జగిత్యాల జిల్లాకు చెందిన కొందరు అటవీశాఖ అధికారులు.. మామూళ్లు తీసుకుంటున్నారని, వాటితోనే డ్యూటీ సమయంలో మందు పార్టీలు చేసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. డ్యూటీ సమయంలో మద్యం పార్టీలకు హాజరైనప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. జగిత్యాలలోని పలు సామిళ్ల యజమానుల నుంచి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అరుణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ సంతోష్ లు లక్ష రూపాయలకు పైగా మామూళ్లు వసూళ్లు చేశారని ఓ సామిల్ యజమాని చెబుతున్నాడు. అంతే కాకుండా ఆ డబ్బుతోనే మంగళవారం రోజు మందు పార్టీ చేసుకున్నారంటూ చెబుతున్న ఓ ఆడియో వైరల్ గా మారింది.


అటవీశాఖ అధికారుల పార్టీ ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. అంతే కాకుండా పొలాల్లో ఉండే చెట్లపై వసూల్ చేయాల్సిన డబ్బును కూడా మామూళ్లు ఇస్తే వసూలు చేయరనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అన్యాయాలు, అక్రమాలు అడ్డుకునే అధికారులే ఇలా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి అటవీశాఖ అధికారులు చేసే అరాచకాలను అడ్డుకోవాలని కోరుతున్నారు. 




ఇటీవలే హన్మకొండ ప్రభుత్వాసుపత్రిలో మందు పార్టీ.


రెండు నెలల కిందట హన్మకొండలోని ఓ ప్రభుత్వ దవాఖానలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మద్యం సేవించిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఆసుపత్రికి వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచే కాక మహారాష్ట్రలోని సరిహద్దు ప్రాంతాల మహిళలు చికిత్స కోసం వస్తుంటారు. ఈ  ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రసూతి ఆస్పత్రిలో మహిళా సిబ్బంది మందు పార్టీ చర్చనీయాంశం అయింది. స్టాఫ్‌రూమ్‌లో మహిళా సిబ్బంది బీర్లు తాగుతూ హల్ చల్ చేశారు. రోగులను గాలికి వదిలేసి బీర్లు తాగుతూ సిబ్బంది హంగామా చేశారు. మద్యం పార్టీలో ఆరోగ్య శ్రీ ఉద్యోగి, ఒక స్టాప్ నర్స్, జీఎన్‌ఎమ్ ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వ్యవహారంపై చికిత్స కోసం వచ్చిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్‌ను బార్‌గా మార్చిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 


పుట్టిన రోజు వేడుకలు పేరిట మందు పార్టీ


హన్మకొండ ప్రసూతి ఆసుపత్రి ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు మహిళా సిబ్బంది బయట నుంచి మరో ఇద్దరు మహిళలను పిలిచి ఆసుపత్రిలో బీర్ పార్టీ చేసుకున్నారు. బుధవారం రాత్రి పుట్టినరోజు వేడుకల పేరిట ఓ గదిలో వైద్య ఆరోగ్య సిబ్బంది మందు పార్టీ చేసుకున్నారు. మందు పార్టీ దృశ్యాలను ఆసుపత్రిలోని రోగుల బంధువులు వీడియో తీశారు. అప్రమత్తంగా ఉండాల్సిన సిబ్బంది ఇలా బాధ్యత రహితంగా వ్యవహరించడంపై కఠిన చర్యలు తీసుకోవాలని రోగుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. హన్మకొండ, వరంగల్ ఉన్నతాధికారుల కార్యాలయాలకు సమీపంలో ఈ ప్రభుత్వ ప్రసూతి దవాఖాన ఉంది. కానీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం ఈ ఘటనతో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా అధికారులు ఏం చేస్తున్నట్టు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.