Viral News In Karimnagar: కుక్కల నియంత్రణలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారన్న కోపంతో ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపారు కరీనంగర్‌ జిల్లా కొత్తపల్లికి చెందిన అజీజ్‌ ఉద్దీన్ తన ఇంటిలో కోడిని పెంచుకుంటున్నాడు. ఈ మధ్య కుక్కలు దానిపై అటాక్ చేశాయి. ఆ దాడిలో కోడి చనిపోయింది. 


కుక్కల దాడిలో కోడి చనిపోడంతో అజీజ్‌కు కోపం వచ్చింది. దీనంతటికీ మున్సిపల్ అధికారులే కారణమని చెప్పి నిరసన తెలిపారు. కోడి కళేబరంతో మున్సిపల్ ఆఫీస్‌కు వెళ్లి అక్కడే కోడిని కట్టేశాడు. 


మున్సిపల్ కమిషనర్‌ ఆఫీస్‌ ముందు కోడి కళేబరాన్ని వేలాడదీశాడు అజీజ్‌. దీనిపై అధికారులను ప్రశ్నించడానికి వస్తే పట్టించుకోవడం లేదనే ఇలా నిరసన తెలిపినట్టు ఓ ఆడియోను కూడా అజీర్ రిలీజ్ చేశాడు. అందులో ఏమన్నడంటే... గత మూడున్నరేళ్లుగా కొత్తపల్లి మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కనీసం వీధి కుక్కలను కూడా నియంత్రించడం లేదు. దీని కారణంగా తరచూ ఈ కుక్కలు మనుషులను పీక్కు తింటున్నాయి. పెంపుడు జంతువులపై కూడా దాడి చేస్తున్నాయి. వీటిని నియంత్రించాలని చాలా సార్లు చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పుడు నా ఇంట్లోకి చొరబడి కోడిని చంపేశాయి. ఒక వేళ అదే ప్లేస్‌లో తన పిల్లలు ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించాడు. 


ఇలా కోడి కళేబరాన్ని తీసుకొచ్చి ఆఫీస్‌ ముందు వేలాడదీయడంపై మున్సిపల్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులకి కూడా సమాచారాన్ని చేరవేశారు. అసలు కుక్కల దాడిలోనే కోడి చనిపోయిందా లేదా అనేది విచారిస్తున్నామని తర్వాత చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.