Telangana Congress Politics: రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటడానికి వ్యుహలకు పదును పెడుతుంది. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి మెజారిటి స్థానాలను హస్తగతం చేసుకోవాలని మాస్టర్ ప్లాన్ వేస్తుంది. అయితే ఇప్పుడు బలమైన అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ కు పెద్ద టాస్క్ గా మారింది. ఇంతకీ క్యూ లైన్ లో ఉన్న ఆశావహులెవరు? మరి కరీంనగర్, పెద్దపల్లి స్థానాల్లో కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచేదెవరు?


ఎంపీ ఎన్నికల్లో మెజరిటి స్థానాలను కైవసం చేసుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ.. బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ మొదలు పెట్టింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు ఎవరనేది క్లారిటి రాలేదు. గత ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైన కాంగ్రెస్.. ఈసారి మొదటి స్థానాన్ని టార్గెట్ గా పెట్టుకుంది. అయితే పార్టీకి ఇప్పుడు కావాల్సినంత బలం ఉన్నా కూడా ఎంపీ అభ్యర్థుల విషయంలో మాత్రం తర్జనభర్జన పడుతుంది. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఎవరనేది దాదాపుగా తెలిసి పోయినప్పటికి కాంగ్రెస్ ఎవరికి అవకాశం ఇస్తుందనే స్పష్టత ఆ పార్టీ శ్రేణుల్లో కనిపించడం లేదు.


ఈసారి చాలా కాన్ఫిడెంట్
పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో 2009 తరువాత కాంగ్రెస్ విజయం సాధించలేదు. అప్పుడు ఎంపీ అయిన వివేక్.. ప్రస్తుతం చెన్నుర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఎన్నికల్లో స్థానికంగా బలమైన అభ్యర్థులు లేరనే కారణంతో మాజీ మంత్రి ఆగం చంద్రశేఖర్ కు టిక్కెట్ ఇచ్చారు. అయితే ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో టిక్కెట్ ఇస్తే చాలు గెలుస్తమనే కాన్పిడెంట్ ఆ పార్టీ లీడర్లు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎస్సీ సామాజిక వర్గ లీడర్లంతా తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రి ఆగం చంద్రశేఖర్ తో పాటుగా చెన్నుర్ ఎమ్మెల్యే వివేక్ కోడుకు వంశీ, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఆశావాహుల లిస్టులో ఉన్నారు. వీరితో పాటుగా మాజీ ఎంపీ సుగుణ కుమారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తరనే ప్రచారం జరుగుతుంది. బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కాసీపేట లింగయ్య ఇటివల రేవంత్ రెడ్డిని కలవడంతో.. ఆయన కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్నారనే టాక్ మొదలైంది.


కరీంనగర్ కే అధిక పోటీ
ఇక కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి పోటీ ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీలే కాదు.. ఆ పార్టీల అభ్యర్థులు బలంగా ఉన్నారు. వారిని నిలువరించాలంటే కాంగ్రెస్ బలమైన ఛరిష్మా కలిగిన లీడర్ ను పోటీలో దింపాల్పి ఉంటుంది. కాంగ్రెస్ ఎంపీ టిక్కెట్ రేసులో ప్రధానంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు వినిపిస్తుంది. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, మాజి ఎమ్మెల్యే వెలిచాల జగపతి రావు తనయుడు వెలిచాల రాజేందర్ రావు ఎంపి రేసులో మేమున్నామంటున్నారట. మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు సైతం పోటికి సై అంటున్నారట. వీరితో పాటుగా ఇటివల హుజురాబాద్ నుంచి పోటి చేసి ఓటమి పాలైన ప్రణవ్ బాబు, ఎమ్మెస్సార్ మనవడు రోహిత్ రావు,ఆశావాహుల లిస్టులో ఉన్నారు. అయితే వీరిలో అధిష్టానం ఎవరిని ఫైనల్ చేస్తుందో చూడాలి.


పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోనూ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలున్నారు. దీంతో సునాయసంగా గెలువొచ్చు అని ఆశావాహులు లెక్కలు వేసుకుంటున్నారు. రెండు చోట్ల బీఆర్ఎస్, బీజేపీలకు బలమైన అభ్యర్థులున్నప్పటికీ.. కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరనేది ఆసక్తిగా మారింది. గత ఎన్నికల్లో ద్విముఖ పోటీ ఉంటే.. ఈసారి త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది.