Forbes: ఫోర్బ్స్.. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు ఉన్న పత్రిక. ప్రతి సంవత్సరం వారు అందించే తాజా నివేదికల కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న మిలియనీర్లు ఎదురు చూస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వ్యక్తిగతంగా, అలాగే కంపెనీల విజయాలకు సంబంధించి వీరు ఇచ్చే జాబితాని ప్రామాణికంగా తీసుకుంటారు సరే ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఇప్పుడు కరీంనగర్ జిల్లావాసి ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ జాబితాలో పేరు సంపాదించుకున్నారు. ఆయనే కరీంనగర్‌లోని పెగడపల్లి మండలం వెంగళాయి పేట గ్రామానికి చెందిన డాక్టర్ సంజీవరావు, పుష్పలత దంపతుల కుమారుడు రఘునందన్ రావు. అమెరికాలో అనేక ప్రఖ్యాత కంపెనీల్లో పని చేసిన ఆయన ప్రస్తుతం ఇన్స్‌పైర్ బ్రాండ్ అంతర్జాతీయ కంపెనీకి చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.


రఘు తండ్రి డాక్టర్ సంజీవ్ రావు వెటర్నరీ వైద్యుడిగా పనిచేసి అసిస్టెంట్ డైరెక్టర్ గా పదవీ విరమణ పొందారు. రఘు సాగి తన ప్రాథమిక విద్యను వరంగల్ లోని సరస్వతి శిశుమందిర్ లో పూర్తి చేసి, జగిత్యాలలోని గీత విద్యాలయంలో హైస్కూల్ విద్యను పూర్తి చేశారు. గుంటూరులోని విజ్ఞాన్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్ జేఎన్టీయూలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అమెరికాలోని సౌతర్స్ ఎలినియోస్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేశారు.


అమెరికాలో విజయవంతమైన ఉద్యోగ ప్రస్థానం
1992 అమెరికా వెళ్ళిన రఘు అంచెలంచెలుగా సిఐఓ స్థాయికి ఎదిగారు. తొలుత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కాస్మెటిక్ కంపెనీ సెఫోరాలో పనిచేసిన అనంతరం వాల్ మార్ట్ లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంజనీరింగ్ గా పని చేశారు. ప్రస్తుతం ఇన్స్‌పైర్ బ్రాండ్స్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ ఫోర్బ్స్ సిఐఓ జాబితాలో చోటు దక్కించుకుని అంతర్జాతీయంగా పేరు పొందారు. ఈ బ్రాండ్స్ రెస్టారెంట్ లలో ఈ ఏడాది 30 బిలియన్ డాలర్ల సేల్స్ సాధించడంలో విజయం దక్కించుకున్నారాయన.


శ్రమించే తత్త్వమే ఈ స్థాయికి చేర్చింది
సాగి రఘుకు ఉన్నత స్థానం దక్కడం పట్ల వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిన్నప్పటి నుండి క్రమశిక్షణతో చదివి ప్రతి అంశంపై పట్టు సాధించే వరకూ శ్రమించేతత్వం ఉన్న రఘు సాధించిన విజయం జిల్లాకే కాదు రాష్ట్రానికి కూడా గర్వకారణమని వారంటున్నారు.


Also Read: తెలంగాణలో నేటి నుంచి గ్రూప్ 1 దరఖాస్తులు షురూ, ఆ అభ్యర్థులకు నో ఛాన్స్ అని బోర్డు ప్రకటన


Also Read: ఏపీ, తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు - అల్పపీడనం ప్రభావంతో నాలుగైదు రోజులు వర్షాలు, ఆరెంజ్ అలర్ట్ జారీ