Weather Update In Andhra Pradesh: తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణ, యానాంలలో నేటి మరో నాలుగైదు రోజుల వరకు వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దీని ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాల్లో మే 4 తేదీకల్లా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తరువాత 24 గంటల్లోనే ఇది బలహీన పడుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది.


కోస్తాంధ్రలో వర్షాలు..
ఎండలతో అల్లాడిపోతున్న ఏపీ ప్రజలకు వర్ష సూచనతో ఉపశమనం కలిగింది. నేటి నుంచి మరో మూడు రోజుల వరకు ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. రైతులు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు చూసుకోవాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లడం అంత సురక్షితం కాదని అధికారులు మత్స్యకారులను హెచ్చరించారు.


దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వాతావరణం నేడు పొడిగా మారుతుంది. రేపటి నుంచి రెండు రోజులపాటు ఈ ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాయలసీమలో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయి. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు పేర్కొన్నారు.






తెలంగాణలోనూ వర్షాలు..
దక్షిణ అండమాన్‌లో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంత తెలంగాణపై ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. నేటి నుంచి మూడు రోజులపాటు కొన్ని జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడతాయి. ఒకట్రెండు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.
 






భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, దేశంలోని అనేక ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో ఈశాన్య రాష్ట్రాలతో సహా కొన్ని కొండ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మే 2న అరుణాచల్ ప్రదేశ్, సబ్ హిమాలయన్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. మే 2 నుంచి మే 4 వరకు అసోం, మేఘాలయాలో ఇదే వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో మే 3, 4 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా బిహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ , ఒడిశాలో రాబోయే ఐదు రోజులలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో అక్కడక్కడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది. రాబోయే ఐదు రోజులలో కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఉరుములు, మెరుపులతో కూడిన చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది.


Also Read: Weather Update: దక్షిణ అండమాన్ సముద్రంలో తుపాను, మే 5న ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు! 


మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ ఏబీపీ దేశంలో చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి