Karimnagar Gandhi: అతనో గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు. స్వతంత్ర సంగ్రామంలోనూ హైదరాబాద్ సంస్థాన ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్న మహోన్నత వ్యక్తి. ఆయనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బోయినపల్లి వెంకట రామారావు. తొలితరం స్వాతంత్య్ర ఉద్యమ నేతల్లో ఒకరైన ఈయన.. యుక్త వయసులోనే భారతదేశ విముక్తి కోసం బ్రిటిషర్లతో పోరాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకి మండలానికి చెందిన తోటపల్లి గ్రామంలో రంగమ్మ, కొండలరావు దంపతులకు సెప్టెంబర్ 2, 1920వ తారీఖున బోయినపల్లి కొండల రామారావు జన్మించారు.
చిన్నప్పుడే బ్రిటీషర్లను ప్రశ్నించిన పహిల్వాన్..
రామారావు ప్రాథమిక విద్యను స్వగ్రామంలోనే పూర్తి చేశారు. మొదటి నుంచే రామారావు జాతీయ భావాలు కల్గిన వ్యక్తి. ఈయన విద్యాభ్యాసంలో చాలా చురుకుగా ఉండేవారు. తెలుగుతోపాటు హిందీ, ఉర్దూ, ఆంగ్ల భాషలను నేర్చుకున్నారు. ఓవైపు చదువుకుంటూనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. తన తోటి సహచరులతో కలిసి అనేకమార్లు బ్రిటిష్ వారి ఆగడాలను ప్రశ్నించారు. వెంకట రామారావుపై ఆర్య సమాజ్ ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉండేది. దీంతో ఆయన మత చాందసవాదులతో సైతం పోరాడి అనేక అంశాల్లో స్థానిక ప్రజలకు రక్షణగా నిలిచారు. ఇక 1942వ సంవత్సరంలో దేశ వ్యాప్తంగా జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. చాలా మందిని ఆ ఉద్యమంలో పాల్గొనేలా ఉత్తేజపరిచారు.
గెరిల్లా తరహా పథకాలతో ప్రజల్లో ఐకమత్యం..
ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ఉవ్వెత్తున ఎగిసిన స్వతంత్ర ఉద్యమానికి చుక్కానిలా నిలిచారు. 40 మంది జాతీయవాదులతో కూడిన ఆయన గురించి అప్పటి బ్రిటిష్ వారు ఎన్నోసార్లు వెతికారట. అంతేకాదు వారు ఒకవేళ దొరికితే కఠిన శిక్షలు విధించాలనే పట్టుతో ఉండేవారట. కానీ ఎప్పుడూ ఆయన వారికి చిక్కలేదు. ఉద్యమాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు గెరిల్లా తరహా పథకాలు వేసేవారట. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న తన అనుచరుల సహాయంతో ప్రజల్లో ఐకమత్యాన్ని తీసుకొచ్చారు. పేదవారికి సహాయం చేయడానికి అప్పుడు దాచి ఉంచిన ధాన్యం గిడ్డంగులపై దాడి చేసి ప్రజలకు ఊరూరా బియ్యం పంపిణీ చేసేవారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఆయన పేరు అందరికీ తెలిసిపోయింది.
వృద్ధాప్యంలోనూ ప్రజాసేవే..!
చిన్నప్పటి నుంచి తప్పును ప్రశ్నించే గుణం ఉన్న ఆయనపై ప్రజలకు గౌరవాభిమానాలు మెండుగా ఉండేవి. ప్రతి గ్రామంలోనూ జాతీయ జెండా ఎగుర వేయాలి అంటూ ప్రజలను ఉత్తేజిత పరిచి బ్రిటిష్ వారికి కంట్లో నలుసుగా మారారు. ఇక స్వాతంత్రం వచ్చిన తర్వాత రజాకార్ల ఆగడాలు సైతం ధైర్యంగా ఎదుర్కొన్నారు. విజయాలను కళ్లారా చూసిన ఆయన తరువాత తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశారు. వృద్ధాప్యంలో కూడా అనేక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ తన ప్రసంగాలతో యువకులను ఉత్తేజ పరిచేవారు. దేశం కోసం తాము పోరాడిన విధానాలను కళ్లకు కట్టినట్టుగా చెబుతూ కొత్త తరానికి ఆదర్శప్రాయంగా నిలిచారు. తోటపల్లి గాంధీగాను కరీంనగర్ గాంధీగాను పేరుగాంచిన బోయినపల్లి వెంకట రామారావుగారు అక్టోబర్ 27.. 2014 వ తారీఖున కన్నుమూశారు.