Smart City Works: కరీంనగర్ పట్టణంలోని నడిబొడ్డున టవర్ సర్కిల్ ఉంటుంది. దాని చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా పూర్తిగా వ్యాపారమయం కావడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. వేలాది మంది జనాలు రోజు ఈ ప్రాంతం నుంచి ప్రయాణం చేస్తుంటారు. వ్యాపారం చేసేందుకు కొందరు, కొనుగోలు చేసేందుకు మరికొందరు వస్తుంటారు. అయితే ప్రతి నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతాన్ని స్మార్ట్ సిటీగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్రత్యేక నిధులతో పనులను కూడా ప్రారంభించింది. ఎక్కడెక్కడ ఏమేం చేయాలి వంటి అన్ని విషయాల గురించి వివరించారు. ఇందుకోసం అధ్భుతమైన గ్రాఫిక్స్ ఉపయోగించి స్మార్ట్ సిటీగా ఎలా మారుస్తారో చూపించారు.


మూడేళ్లుగా తప్పని తిప్పలు..


ప్లానింగ్ అంతా కరెక్టుగానే ఉన్నప్పటికీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. పనుల్లో నిర్లక్ష్యం వల్ల ఆయా ప్రాంతంలో వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిజానికి టవర్ చుట్టు పక్కల ప్రాంతాలు అయిన రాజీవ్ చౌక్, పొట్టి శ్రీరాములు చౌక్, ప్రొఫెసర్ జయశంకర్ జంక్షన్ లను ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేస్తున్నామంటూ చెప్తూనే వస్తున్నారు తప్ప పనులను మాత్రం పూర్తి చేయడం లేదు. దాదాపు మూడేళ్లుగా నగర ప్రజలను ముప్ప తిప్పలు పెడుతున్నారు. ఇప్పటికే పనులన్నీ పూర్తి కావాల్సి ఉండగా.. పార్కింగ్ స్థలం లేని చోట పార్కింగ్ పేరుతో రోడ్లన్నీ బ్లాక్ చేస్తూ ఉండడంతో ప్రజలు మరింత ఇబ్బంది పడుతున్నారు. అసలు టవర్ సర్కిల్ వైపు రావాలంటేనే ప్రజలు భయపడి పోతున్నారు. 


అసలే సగం సగం పనులు.. ఆపై వర్షం..!


కాంట్రాక్టర్ పనులను ఎక్కడ పడితే అక్కడ మొదలు పెట్టారు కానీ.. వాటిని పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలి పెట్టారు. అంతే కాకుండా యూజీడీ చాంబర్లను మరోవైపు సాధారణ ఎత్తు కంటే ఎక్కువగా నిర్మించడంతో వెళ్లే వాహనాలకు అడ్డుగా నిలుస్తున్నాయి. ఈ పనులు కూడా కొన్ని చోట్ల పూర్తి కాకపోవడంతో.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మరింత నాశనం అయ్యాయి. వీటి వల్ల రోడ్డంతా పాడై ప్రయాణికులు అటుగా వెళ్లేందుకు కూడా వీలవడం లేదు. 


దేవుడు కరుణించినా...


నిజానికి కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని.. క్రమం తప్పకుండా నిధులను కేటాయిస్తూ వచ్చింది. అలాగే రోడ్లు, మురుగు నీటి పారుదల వ్యవస్థ పార్కింగ్ సుందరీకరణ పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసే ప్రోత్సాహకాలను కూడా అందించింది. కానీ అద్భుతమైన గ్రాఫిక్స్ తో అందరినీ అబ్బరపరిచిన అధికారులు మాత్రం క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులపై కన్నెత్తి కూడా చూడటం లేదు. కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుందరీకరణ పక్కన పెడితే ఉన్న అందం కూడా చెడిపోయేలా తయారైంది. టవర్ సర్కిల్ వద్ద రోజుల తరబడి రోడ్లను మూసివేసి ఉండడంతో పనులపై ఎప్పుడో ఒకసారి వచ్చే వారికి ఈ దారిన వెళ్ళాలో లేదో కూడా తెలియట్లేదు. సాధారణంగానే టవర్ సర్కిల్ వద్ద సహజంగానే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక తెలియక తమ కారులో బయల్దేరిన వారికి టవర్ సర్కిల్ ప్రయాణంలో నరకం కనబడుతుంది.