మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణపురంకు చెందిన బొద్దుల రాజేష్ అనే యువకుడి పెళ్లి గద్దేరాగడిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో బుధవారం రోజు జరుగుతోంది. వివాహ తంతు జరుగుతుండగానే... అక్కడకు ఓ అమ్మాయి వచ్చింది. అచ్చం తెలుగు సినిమాల్లో లాగానే పెళ్లి ఆపండి అంటూ గట్టిగా కేక వేసింది. ఏమైందంటూ అందరూ ఆమెను చూస్తున్నారు. ఆమె వధూవరులిద్దరూ స్నేహితురాలేమో, ఏదైనా సర్ ప్రైజ్ ప్లాన్ చేసిందేమోనని చాలా మంది అనుకున్నారు. కానీ ఆమె వచ్చింది వారిద్దరికి సర్ ప్రైజ్ ఇవ్వడానికి కాదు. షాక్ ఇవ్వడానికి.
వచ్చింది బంధువు కాదండోయ్ వరుడి ప్రేయసి..
అదేంటీ అనుకుంటున్నారా. నిజమండి. ఆమె పెళ్లి కూతురుకో, పెళ్లి కుమారుడికో స్నేహితురాలు అయితే అదే జరిగేది. కానీ వచ్చింది నవ వరుడి ప్రేయసి. పెళ్లి పీఠల మీద కూర్చొని మరో అమ్మాయి మెడలో తాళి కట్టేందుకు రెడీగా ఉన్న రాజేష్ తనను ప్రేమించాడని, గత ఎనిమిదేళ్లుగా తామిద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నట్లు బంధువుల అందరి ముందే చెప్పింది. అందుకే ఆ పెళ్లిని ఆపేసింది. తనను మోసం చేసిన యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె మాటలు విన్న అమ్మాయి తరపు బంధువులంతా ముక్కున వేలేస్కున్నారు. చోద్యం చూసినట్లుగా చూస్తుండిపోయారు.
రాజేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
అమ్మాయి కుటుంబ సభ్యులు అయితే ఓ వైపు విలపిస్తూనే మరోవైపు పెళ్లి కొడుకుపై దుమ్మెత్తి పోశారు. ఇలాంటి వాడికా తమ కూతురును ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది అని కన్నీటి పర్యంతం అయ్యారు. ఆమెతోపాటే పెళ్లి మండపంలోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు పెళ్లి కుమారుడు రాజేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై పూర్తి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
అసలేమైందంటే..?
పెళ్లి కుమారుడు బొద్దుల రాజేష్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. ప్రియురాలు రమినా కూడా గతంలొ రామకృష్ణపురంలోనే ఉండే వారని... అయితే కొన్నేళ్ళుగా ఆమె హుజూరాబాద్ లో ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. గతంలో రమినాకు ఓ యువకుడితో పెళ్లి జరిగింది. ఆ తరువాత వారు విడిపోవడంతో రాజేష్ పరిచయం అయ్యాడు. గత ఎనిమిదేళ్లుగా రాజేష్ తనను ప్రేమిస్తున్నాడని, తనను శారీరకంగాను వాడుకున్నాడని, గతేడాది అబార్షన్ కూడా చేయించాడని యువతి ఆరోపించింది. తనతో రాత్రి వరకు వాట్సాప్ లో చాట్ చేశాడని.. అసలు ఈ పెళ్ళి విషయం తనకేమి తెలియదని చెప్పింది. అయితే రాజేష్ వాళ్ల బంధువులో ఒకరు వాట్సప్ స్టేటస్ పెడితే ఈ పెళ్ళి విషయం తనకు తెలిసిందిని వివరించింది.
నన్నెలా మోసం చేయాలనిపిందంటూ రమినా రోదన..
విషయం తెలిసి పెళ్లి మండపానికి పోలీసులతో సహా వచ్చానని.. అందుకే పెళ్లి ఆపేశానని రమినా వివరించింది. ఎనిమిదేళ్లుగా తనకు మాయ మాటలు చెప్పి ప్రేమించానని, శారీరకంగా వాడుకున్న నీకు నన్ను ఎలా వదిలేయాలనిపించింది అంటూ రాజేష్ కాలర్ పట్టుకొని అడిగింది. ఓ వైపు ఏడుస్తూనే, మరోవైపు కోపంతో ఊగిపోయింది.