Karimnagar Commissioner of Police Satyanarayana: హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన ఓ అధికార పార్టీ నేత చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. తన లైసెన్స్ రివాల్వర్లు అందరికీ కనిపించేలా ఓ కార్యక్రమంలో పాల్గొనడంతో అందుకు సంబంధించిన ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు ప్రత్యర్థి పార్టీల నేతలను టార్గెట్ చేస్తూ విచ్చలవిడిగా లైసెన్స్ ఇస్తున్నారంటూ ఏకంగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఆరోపణలు చేయడంతో జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. జరుగుతున్న పరిణామాలపై జిల్లా పోలీసు బాస్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అందరికీ కనిపించేలా గన్.. ఫొటో వైరల్
హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన ఎంపీపీ భర్త ఒకరు తన టీ షర్టు వెనకాల గన్ కనిపించేలా పెట్టుకున్నారు. ఇది గమనించిన కొందరు ఫొటో తీశారు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. తన నియోజకవర్గంలో అందరికీ తెలిసే విధంగా కావాలని ఇలా చేశారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ హైదరాబాదులో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. పోలీసులు విచ్చలవిడిగా తన నియోజకవర్గంలో గన్ లైసెన్సులు ఇస్తున్నారని.. తనకు గాని తన కుటుంబానికి గాని ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
నియోజకవర్గంలో దాదాపుగా 40 మందికి గన్ లైసెన్సులు ఇచ్చారంటూ ఆరోపించడం సంచలనం రేపింది. నిజానికి హుజురాబాద్ ఒకప్పుడు మావోయిస్టులకు అడ్డా అయినప్పటికీ, ప్రస్తుతం వారి ప్రభావం లేకపోవడంతో గతంలో ఇక్కడ ఉన్న పలువురు వ్యాపారుల ఆత్మ రక్షణ కోసం లైసెన్సులు ఇచ్చేవారు. అయితే కొందరు ఇల్లీగల్ గా కూడా లైసెన్స్ లేకుండానే తుపాకులను కలిగి ఉన్నారని ఆరోపణలు అప్పట్లో సంచలనం రేపాయి.
ఎమ్మెల్యే ఆరోపణల్లో నిజం లేదు: సీపీ సత్యనారాయణ
గన్ కల్చర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ హుజురాబాద్ లో విలేకరులతో మాట్లాడారు. తాము గత రెండు సంవత్సరాలలో కేవలం ఇద్దరికీ మాత్రమే గన్ లైసెన్స్ జారీ చేశామని తెలిపారు. ఇందులో ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తికి లైసెన్స్ జారీ చేయగా, ఈ మధ్య జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకల్లో సదరు వ్యక్తి తన ప్యాంటు జేబులో నుండి తుపాకీ బయటకు కనబడేలా ఉన్న ఫొటో తమ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో ఆ వ్యక్తిని పిలిపించి మందలించామని, ఇలా లైసెన్స్ పొందిన వ్యక్తులు గన్ ప్రదర్శిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు వివరించారు.
తాము దాదాపుగా 40 లైసెన్సులు ఇచ్చామంటూ వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఒకవేళ ఎమ్మెల్యే వద్ద ఏమైనా అదనపు సమాచారం ఉంటే తమకు అందించవచ్చని తెలిపారు. ఇప్పటికే కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో మావోయిస్టుల ఉనికి తగ్గిపోయిందని.. ఎవరైనా వారి పేరుతో ఫోన్లు చేసి బెదిరిస్తే తమకు సమాచారం అందించాలని రాజకీయ నాయకులు, వ్యాపారులకు సూచించారు. సామాజిక మాధ్యమాల్లో సైతం పూర్తి సమాచారం లేకుండా ఎలాంటి పోస్టులు షేర్ చేయొద్దని ప్రజలను కోరారు.