గత రాత్రి జన జాగరణ దీక్ష నుంచి అరెస్టు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కాసేపటి క్రితం కరీంనగర్‌ కోర్టులో హాజరుపర్చారు. ధర్మాసనం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అంతకుముందు బండి సంజయ్‌కు వైద్య పరీక్షలు నిర్వహింపజేసిన పోలీసులు ఆయనపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇకపై సభలు, సమావేశాలు ఆయన నిర్వహించుకొనేందుకు అనుమతి లేదని కరీంనగర్ సీపీ సత్యనారాయణ తెలిపారు. బండి సంజయ్‌పై డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టం కింద కూడా కేసులు నమోదు చేశామని.. మొత్తం 25 మందితో పాటు మరికొందరిపై కరోనా నిబంధనల కింద కేసులు పెట్టామని కరీంనగర్ సీపీ తెలిపారు. బీజేపీ శ్రేణులు కావాలనే పోలీసులపై దాడికి దిగారని సీపీ తెలిపారు.


అయితే, బండి సంజయ్ చేస్తున్న పోరాటం బీజేపీ అధిష్ఠానం దృష్టికి కూడా వెళ్లింది. సోమవారం మధ్యాహ్నం బండి సంజయ్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేశారు. అయితే, ఆయన పోలీసుల కస్టడీలో ఉన్నట్లుగా కార్యాలయ సిబ్బంది నడ్డాకు తెలిపారు. స్పందించిన నడ్డా..  బండి సంజయ్‌పై ప్రశంసలు కురిపించారు. ‘‘సంజయ్ జీకి నా మాటగా చెప్పండి. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పక్షాన పోరాటం చేస్తున్న తీరు భేష్.. కేసుల విషయంలో ఏం వర్రీ కావొద్దు.. మేం చూసుకుంటాం.. అవసరమైతే కోర్టులో పోరాడదాం. జాతీయ నాయకత్వం సంజయ్ జీకి మద్దతుగానే ఉంటుంది’’ అని జేపీ నడ్డా భరోసా ఇచ్చారు.


కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత
బండి సంజయ్ అరెస్టు నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంటుంది. బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ దగ్గరకు భారీగా బీజేపీ కార్యకర్తలు, నేతలు చేరుకున్నారు. అక్కడికి సీపీ కూడా చేరుకోవటంతో బీజేపీ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.