రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయడంపై మంత్రి గంగుల కమలాకర్‌ స్పందించారు. గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి బండి సంజయ్‌ జాగరణ దీక్ష చేస్తున్నారని ఆరోపించారు. కోవిడ్‌ నిబంధనలు పాటించే బాధ్యత బీజేపీ నేతలకు లేదా అని ప్రశ్నించారు. నిబంధనలు అతిక్రమించినందువల్లే పోలీసులు తమ పని తాము చేసుకుంటూ పోయారని అన్నారు. ఆయనది జాగరణ దీక్ష కాదని, కొవిడ్‌ను వ్యాప్తి చేసే దీక్ష అంటూ గంగుల ఎద్దేవా చేశారు. పోలీసుల అనుమతి కూడా లేకుండా దీక్ష ఎలా చేస్తారని నిలదీశారు. ఒక ఎంపీ చట్టాలను ఉల్లంఘిస్తే ఎలా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో ఎవరైనా దీక్షలు చేస్తే కేంద్ర ప్రభుత్వం అరెస్ట్‌ చేయాదా? అలాగే ఇక్కడా పోలీసులు చేశారని అన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్‌ పోలీసులను గంగుల అభినందించారు.


ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోను వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తలపెట్టిన జన జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు దీక్షను అడ్డుకోవడాన్ని బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. నల్గొండలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభకు అనుమతించిన పోలీసులు తమకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. 317జీవో వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతుందని, సొంత జిల్లాలో కూడా పరాయి వాడిగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తిందని చెప్పారు. జీవోను సవరించి, అందుకు అనుగుణంగా బదిలీల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.


ప్రజా స్వామ్యానికే గొడ్డలిపెట్టు: కిషన్ రెడ్డి
బండి సంజయ్ అరెస్టును కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలన నియంత్రత్వాన్ని, ఎమర్జెన్సీని తలపిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ అనే వ్యక్తి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు.. అయినా ఎంపీ కార్యాలయ గేట్లను విరగ్గొట్టి లోపలకు పోలీసులు వెళ్లడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు.


ఎంపీ అనే కనీస గౌరవం లేకుండా ప్రోటోకాల్ ను కూడా ఉల్లంఘిస్తూ బండి సంజయ్‌ను దారుణమైన స్థితిలో అదుపులోకి తీసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు. ఎంపీ బండి సంజయ్ చేస్తోంది ‘జాగరణ’ మాత్రమే. కోవిడ్19 నిబంధనలను పాటిస్తూ తన కార్యాలయంలో ‘జాగరణ’  చేస్తుంటే అడ్డుకోవడమా? మరి ఏ విధంగా నిరసన తెలపాలి?.  ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు ఇది విరుద్దం. నిరసన హక్కులను కాలరాయడమంటే రాజ్యాంగ హక్కులను కాలరాయడమేనని‌ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 


Also Read: Shiva Parvathi Theatre: కూకట్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. శివపార్వతి థియేటర్‌ పూర్తిగా దగ్ధం.. భారీ ఆస్తి నష్టం 


Also Read: LB Nagar Youth Fight: మద్యం మత్తులో యువకులు వీరంగం... ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో దాడులు... ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి