కరీంనగర్ జిల్లాలోని కాంగ్రెస్ నేతలు ఈ మధ్య అనేక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం మీద విరుచుకుపడుతూ వరుస ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతి అంశంపై స్థానికంగా చేస్తున్న కార్యక్రమాలు ఎంతో కొంత వరకు రాజకీయాల్లో వేడి పెంచారు. దీంతో ప్రజలలో కూడా వారు కొంతవరకు అనుకూలతను సంపాదించుకోగలిగారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటారా? కాంగ్రెస్ యువనేత NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ పై జమ్మికుంటలోని పోలీసు స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అందులో అన్నిటికంటే విచిత్రంగా గాడిదను దొంగతనం చేశారని టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ విషయాన్ని కరీంనగర్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ మీడియాకు తెలియజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా గాడిదను వెంకట్ దొంగతనం చేయడమే కాకుండా దాన్ని తీవ్రంగా హింసించారని అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
పైగా దొంగతనం చేసిన ఆ గాడిద ఎక్కడిది?? దాని ఓనర్ ఎవరు?? అనే విషయాలను వెంకట్ ని పలుమార్లు ప్రశ్నించినా ఆయన నుంచి సమాధానం రాలేదని దీంతో కేసు నమోదు చేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు. మరోవైపు గాడిదను ఎక్కడ నుండి తెచ్చారనే అంశంపై విచారణ జరుపుతున్నామని అన్నారు. సహజంగానే ఈ జంతువును కొన్ని బలహీన వర్గాలకు చెందిన సంచార జాతులకు చెందిన ప్రజలు తమ దైనందిక అవసరాల కోసం ఆసరాగా ఉంటుందని పెంచుకుంటారని.. అలాంటి జంతువులను దొంగతనం చేసి తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం వెంకట్ హింసించి అవమానించారని వివరించారు.
మరోవైపు సమాజంలోని వివిధ వర్గాల మధ్య రెచ్చగొట్టే చర్యలకు పూనుకోవడమే కాకుండా వైషమ్యాలను పెంచుతున్నారని ఆయన అన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని వెంకట్ పై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యానిమల్స్ యాక్ట్‌లయిన Cr.No: 74/2022 u/s 143,153,379,429, r/w 149 Sec 11 of cruelty of Animal Act కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
బల్మూర్ వెంకట్ NSUI రాష్ట్ర నేతగా ఈమధ్య పలు ధర్నా లలో చురుగ్గా పాల్గొనడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థి నాయకులను కో ఆర్డినేట్ చేసుకుంటూ అనేక అంశాలపై ప్రభుత్వం పైన విరుచుకు పడుతున్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి కీలక నేతగా ఉన్న ఈటల రాజేందర్ రాజీనామా చేసిన తర్వాత వచ్చిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున అభ్యర్థిగా నిలబడ్డారు. చిన్న వయసులోనే కీలకమైన పదవికి పోటీలో పాల్గొన్నారు. ఆ సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పై, టీఆర్ఎస్ నాయకులపై పలుమార్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బల్మూరి వెంకట్ వినూత్న నిరసన చేశారు. ఓ గాడిదకు సీఎం ఫోటో తగిలించి కేకు తినిపించారు. దీన్ని ఆయన ట్వీట్ చేశారు.