తెలంగాణ సీఎంగా కేసీఆర్ వచ్చిన తర్వాత మానవ సంబంధాలను నిషేధించారని, ఒక పార్టీ నాయకులు ఇంకో పార్టీ వారితో మాట్లాడటం లేదు, ఫంక్షన్లకు పోయే పరిస్థితి లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. రాష్ట్రంలో కొత్త పార్టీ అంశం తనకు తెలియదన్నారు. అయితే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాకు మంచి మిత్రులు అని, అన్ని పార్టీలలో ఉన్న వారితో తనకు సత్సంబంధాలు ఉన్నాయన్నారు. తనకు టీఆర్ఎస్ వారితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయని, కానీ కేసీఆర్ తో ఉన్నవారు ఎవరు కూడా సంతోషంగా లేరన్నారు. అందరి ఎజెండా కేసీఆర్ ను ఓడగొట్టడం అని స్పష్టం చేశారు. కేసీఆర్ అక్రమాలను, దుర్మార్గాలను, దోపిడీని అక్రమ సంపాదనను బొంద పెట్టడమే లక్ష్యంగా పని చేస్తాం అన్నారు.


హుజూరాబాద్ సబ్ జైల్ లో చెల్పూర్ సర్పంచ్ మహేందర్ గౌడ్ ను ములాఖత్ ద్వారా కలుసుకొని, పరామర్శించారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. జైల్ వద్ద ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. హుజురాబాద్ ప్రజలు కేసీఆర్ అహంకారానికి గోరి కట్టిన తర్వాత హుజూరాబాద్ ప్రజల మీద కక్ష తీర్చుకొనే ఉద్దేశంతో అనేక రకాల చిల్లర చర్యలకు పాల్పడుతున్నారు. 
ఇక్కడున్న మానేరు నది నుంచి ఇసుకను దోసుకుపోతున్నారు. ఆ వాగు అంతా ఎండగొట్టి రైతుల మీద కక్ష తీర్చుకున్నారు అని ఆరోపించారు. ఇక్కడ వేసుకున్న రోడ్లమీద 50 టన్నుల ఇసుక టిప్పర్లు తిప్పి రోడ్లను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఇక్కడ ప్రజలు మాకు (బీఆర్ఎస్ కు) ఓట్లు వేయలేదు బిజెపికి ఓట్లు వేశారని ప్రజల మీద, ప్రజాప్రతినిధుల మీద కక్ష కట్టారు.  ఇక్కడ కొంతమంది పోలీసు అధికారులు నాయకులకు బానిసలలాగా.. వారి ఇంట్లో అటెండర్లలాగా పనిచేస్తున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు చట్టబద్ధంగా మెలగాల్సిన పోలీసులు వారింట్లో పని మనుషులుగా పనిచేసే దౌర్భాగ్యం వచ్చింది. కేసీఆర్ ఒక సైకోలాగా, ఒక శాడిస్టులాగా తెలంగాణ ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నారు. అందరి హక్కులను హరిస్తున్నారు. పోలీస్ స్టేషన్ల కేంద్రంగా చేర్చుకొని ప్రతిపక్షాల నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టడమే కాకుండా పోలీసులతో కొట్టిస్తున్నారు. అనేక రకాల దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వానికి పోయేకాలం వచ్చింది’ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల వ్యాఖ్యానించారు.


కేసీఆర్ చెంచాలు, కేసీఆర్ బానిసలు, సైకోలు చేసే పనులు చూస్తూ ఉన్నాం. అధికారుల మీద, ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నారు. వీరి దౌర్జన్యాలు, చిల్లర వేషాలు చెల్లవు. ఈ ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం. ఎవరికి ఎప్పుడు, ఎలా బుద్ధి చెప్పాలో సత్తా ఉన్న ప్రజలు ఉన్నారు. పిచ్చిపిచ్చి వేషాలు మానకొకపోతే అక్రమ కేసులు ఆపకపోతే కార్యకర్తల మీద పోలీసులతో దౌర్జన్యాల ఆపకపోతే తప్పకుండా ప్రతిఘటన తప్పదు అని హెచ్చరిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో వీరిని వదిలిపెట్టేది లేదు. న్యాయస్థానాల మీద సంపూర్ణమైన నమ్మకం ఉన్న వాళ్ళం అన్నారు ఈటల.


చెల్పూరు సర్పంచ్ మహేందర్ మీద అక్రమ కేసులు పెట్టారు. వారి గ్రామపంచాయతీలో ఒక తీర్మానం చేశారు. మా తీర్మానం ప్రకారం డబ్బా తొలగిస్తే అకారణంగా పోలీసులు తీసుకువెళ్లి అర్ధరాత్రి కొట్టారు. మోసొస్తుంది అని మొరపెట్టుకున్న ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని సిఐ మాట్లాడుతున్నారని చెప్పారు. ఆ సీఐ సంగతి చూస్తాం, సిఐ సస్పెండ్ చేసేంతవరకు వదిలిపెట్టేది లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 2023 వరకు ఉంటుంది. ఆ తర్వాత ఉద్యోగం ఎక్కడ చేస్తారో చూస్తాము. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసే పోలీసు అధికారులకు చట్టబద్ధంగా శిక్ష తప్పదు, ప్రజాక్షేత్రంలో ఇలాంటి వారికి శిక్ష తప్పదు అని హెచ్చరించారు. చట్టాలు వారి చుట్టాలు కావు. మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం అని తెలిపారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. 


అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ దోచుకున్నారు. అందుకే సీఎం పదవిలో ఉన్నా వారి జీవితాల్లో ప్రశాంతత లేదన్నారు. ప్రజల ఆస్తులను దోచుకుని లక్షల కోట్లకు పడగలెత్తి అక్రమాస్తులతో దేశంలో రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని సీఎం కేసీఆర్ పై ఆరోపణలు చేశారు. తాత్కాలికంగా తప్పించుకోవచ్చు కానీ దీర్ఘకాలంగా తప్పించుకోలేరని, చట్టం ముందు అందరూ సమానులే. సమయం వచ్చినప్పుడు తప్పకుండా శిక్ష తప్పదు అన్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డ వారిపై అనేక సంస్థలు ఎంక్వయిరీ చేస్తున్నాయని చెప్పారు.