అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ గొప్పతనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అన్నకుగాని తమ్ముడికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ ఈ పండుగలో విశేషం. రాఖీ అంటే ఒక రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే పండుగ. చెల్లి తన అన్నయ్య లేదా అక్క తన తమ్ముడు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ సోదరుడికి కట్టేదే ఈ రాఖీ. అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో కామెడీగా చూపిస్తున్నారు. సరదాగా కొంత మంది రీల్స్ చేస్తూ రాఖీ పండుగ గొప్పతనాన్ని ఆవశ్యకతను చాటి చెబుతున్నారు.


ఒకే ఇంట్లో ఉండే సోదరసోదరీమణులు రాఖీ పండుగ జరుపుకోవడం పెద్ద ఇబ్బందేమీ కాదు. పెద్దయ్యాక దూర ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ఈ రాఖీ పండుగ జరుపుకోవడం కోసం ప్రత్యేకంగా ప్రయాణాలు సైతం చేస్తుంటారు. బుధవారం (ఆగస్టు 31) హైదరాబాద్ లో బస్టాండ్లలో రద్దీ పెరగడం.. ప్రజలు రాఖీ పండుగకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని చాటుతోంది. ఇదిలా ఉంటే కరీంనగర్ జిల్లాలో ఓ పెద్దావిడ రాఖీ పండుగ సందర్భంగా తన తమ్ముడికి రాఖీ కట్టడానికి చేసిన పని ఆమెపై మరింత మక్కువను పెంచుతోంది.


ఈ రక్షా బంధన్ పర్వదినం రోజు ఓ అవ్వ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. తన తమ్ముడికి రాఖీ కట్టడం కోసం ఏకంగా 8 కిలోమీటర్ల పాటు నడుచుకుంటూ వెళ్తోంది. ఈ పెద్దావిడ కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందినట్లుగా తెలుస్తోంది. తన తమ్ముడికి రాఖీ కట్టేందుకు నడుచుకుంటూనే పొరుగున ఉన్న కొండయ్యపల్లికి పయనం అయింది. నడుచుకుంటూ ఎక్కడికి పోతున్నవాని ఓ పాదచారి పలకరించగా.. తన తమ్ముడికి రాఖీ కట్టడానికి వెళ్తున్నానని చెప్పింది. ఆ వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే బాగా వైరల్ అయింది. తమ్ముడంటే ఆ అవ్వకు ఎంత ప్రేమ అంటూ కామెంట్లు చేస్తున్నారు.