Jammikunta Tehsildar Arrest: కొందరు ప్రభుత్వ ఉద్యోగం ఉంటే చాలు.. ఆమ్యామ్యాలకు అలవాటు పడటమే. బల్ల కింద చేయి పెట్టి వసూళ్లు చేయడమే. ఉద్యోగాన్ని అడ్డంపెట్టుకుని... అడ్డగోలుగా సంపాదించడమే. కోట్లకు కోట్ల రూపాయలు  వెనుకేసుకోవడమే. ఇటీవల హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ అక్రమాస్తుల చిట్టా చూసి అధికారులే అవాక్కయ్యారు. వందల కోట్ల ఆస్తులను బినామీల పేరుతో పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇలాంటి వారు ఎంతమందో..? దొరికితే దొంగ..  లేకపోతే దొర అన్నట్టు కొందరు కొందరు అధికారుల తీరు ఉంది.


శివబాలకృష్ణ అవినీతి ఎపిసోడ్‌ మరిచిపోకముందే... కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట తహశీల్దార్‌ రజనీ అవినీతి బయటపడింది. జమ్మికుంట తహశీల్దార్‌ రజనీని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఏసీబీ అధికారుల ప్రత్యేక  బృందం... హనుమకొండ కేఎల్‌నగర్‌ కాలనీలోని ఆమె ఇంట్లో తనిఖీలు చేశారు. ఆమె నివాసంతోపాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో కూడా సోదాలు చేశారు. ఇవాళ (మార్చి 13) ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు చేశారు ఏసీబీ  అధికారులు. తనిఖీలు ముగిసిన తర్వాత... జమ్మికుంట తహశీల్దార్ రజినీ ఆస్తులను ప్రకటించింది ఏసీబీ. మార్కెట్‌ విలువ ప్రకారం ఆమె ఆస్తుల విలువ 20 కోట్ల రూపాయలకుపైగా ఉంటుందని గుర్తించారు ఏసీబీ అధికారులు. 


22 ఓపెన్‌ ఫ్లాట్లు... ఏడు ఎకరాల వ్యవసాయ భూమి, కిలోలకొద్దీ బంగారం, వెండి అభరణాలు... ఏసీబీ అధికారుల సోదాల్లో ఇవన్నీ గుర్తించారు. అన్ని ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. బినామీ పేర్లతో పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్టు  కూడా గుర్తించారు. కొన్నవే కాదు... కొనేందుకు అడ్వన్సులు ఇచ్చిన ఆస్తులను కూడా లెక్కకట్టింది ఏసీబీ. పెద్ద మొత్తంలో ఆస్తుల కొనేందుకు తహశీల్దార్ రజినీ అడ్వాన్స్‌ చెల్లించినట్టు కూడా ఏసీబీ అధికారుల తనిఖీల్లో తేలింది. ఆమెకు  సంబంధించిన రెండంతస్తుల భవనం, రెండు చోట్ల ఇళ్ల స్థలాలు కూడా ఉన్నాయని తెలిపారు. రెండు కార్లు, మూడు బైక్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు..  బ్యాంకులో 25లక్షల నగదు, కిలోన్నర బంగారు ఆభరణాలు గుర్తించారు.  జమ్మికుంట తహశీల్దార్‌ రజనీని అరెస్ట్‌ చేసిన ఏసీబీ అధికారులు... రేపు (గురువారం) కరీంనగర్‌ ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఆమెను ప్రవేశపెట్టనున్నరు. 


తహశీల్దార్‌ రజినీ అక్రమాస్తులకు సంబంధించి విచారణ కొనసాగుతుందని చెప్పారు ఏసీబీ అధికారులు. ఆమె బినాలు ఎవరు...? ఎవరెవరి పేరుపై ఆస్తులు ఉన్నాయి...? ఇలా.. అన్ని కోణాల్లో విచారణ జరపనున్నారు. మరింత లోతుగా దర్యాప్తు  చేసి.. ఆమె అవినీతి చిట్టాను బయటకులాగే పనిలో ఉంది ఏసీబీ అధికారుల బృందం.