Telangana News: ఎన్నికల వేళ రాజకీయ విమర్శలు కామనే. కానీ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో విమర్శలతోపాటు రామ నామం వినిపిస్తోంది. రాముడు మీవాడే కాదు మావాడు కూడా అంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఎన్నికలవేళ ఇది హాట్‌టాపిక్‌గా మారుతోంది. తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓ కొత్త నినాదం వినిపిస్తోంది. గెలుపు కోసం రాజకీయ వ్యూహాలు రచిస్తున్న రాజకీయ పార్టీలు రామనామ స్మరణ చేస్తున్నాయి. రాముడి పేరు వాడుకునేందుకు పోటీ పడుతున్నాయి. 


విలక్షణ తీర్పుతో ప్రత్యేకతను చాటుకునే కరీంనగర్ ప్రజలు ఈసారి మాత్రం ఎవరికి పట్టంకట్టనున్నారనే విషయం మాత్రం ఆసక్తికరంగా మారింది. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్లమెంటు స్థానాల కంటే కరీంనగర్‌పై ఎక్కువ ఫోకస్ ఉంది. ఇక్కడ విజయం సాధించేందుకు రాజకీయ వ్యూహాలను రచిస్తూ గెలుపు కోసం ఆరాటపడుతున్నాయి. 


ఈ పరిస్థితుల్లో రాముడు చుట్టు రాజకీయం తిరుగుతుంది. నేతల నోట జై శ్రీరామ్‌ నినాదం గట్టిగానే వినిపిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఇటీవల చేసిన కామెంట్స్ హాట్‌టాపిక్‌గా మారాయి. జై శ్రీరామ్ నినాదం టిఆర్ఎస్ కూడా చేస్తుందని క్యాడర్‌కి క్లారిటీ ఇచ్చారు. రాముడు బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ కాదని, ఆ పార్టీ సభ్యుడు కూడా అంతకంటే కాదు అంటూ కామెంట్స్ చేశారు.


కరీంనగర్‌లో రాముడు నినాదం ఎక్కువగా వినబడుతుంది. బిజెపి మొదటి నుంచి జై శ్రీరామ్ నినాదంతోనే ముందుకి సాగుతుంది. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా కరీంనగర్ సెగ్మెంట్లోని ప్రజలందరికీ రాముడి ఫొటోలు పంపించారు బండి సంజయ్. ఇప్పుడు కూడా అదే నినాదంతో వెళ్తోంది. అందుకే రాముడు విషయంలో బిజెపిని బీట్ చేసేందుకు బిఆర్ఎస్ తమ రాజకీయ ప్రసంగాల్లో భాగం చేసుకుంటున్నారు. బిజేపీ పార్టీకే రాముడు దేవుడా మా పార్టీకి కూడా రాముడు దేవుడే అంటూ రాజకీయాల్లో ప్రసంగాలు చేసుకుంటున్నారు.


బిజెపి అభ్యర్థి బండి సంజయ్‌ని టార్గెట్ చేసుకున్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ రాముని మొక్కుదాం బిజెపిని తొక్కుదామంటూ నినాదాలు చేశారు. అయోధ్య రామ మందిర విరాళాల విషయంలో బిజెపి వెనక పడింది అంటూ విమర్శించారు  కేటీఆర్. గత ఎన్నికల సమయంలో కెసిఆర్ నోట వచ్చిన ఓ మాట కరీంనగర్‌లో డామేజ్‌ చేసింది. అలాంటి తప్పిదాలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బిఆర్‌ఎస్ నాయకులు.


అటు కాంగ్రెస్ పార్టీ కూడా రాముడు పేరును రాజకీయ ఉపన్యాసాల్లో చేర్చింది. దీనికి కౌంటర్‌గా బీజేపీ వాళ్లు కూడా విమర్శలు చేస్తున్నారు. అయోధ్య రాముడేనా భద్రాచల రాముడు కనబడడం లేదా అన్న నాయకులు ఇప్పుడు రామ జపం చేస్తున్నారని ఆంటున్నారు. కరీంనగర్‌లో జైశ్రీరామ్ నినాదానికి తామే కారణమంటున్నారు బీజేపీ నేతలు. టిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల నోట నుంచి జైశ్రీరామ్ వచ్చిందంటే బిజెపి వల్లే అంటూ ప్రచారాలు చేసుకుంటున్నారు. ఇలా కరీంనగర్ రాజకీయాల మాత్రం జైశ్రీరామ్ నినాదం చుట్టే తిరుగుతున్నాయి. ఎన్నిసార్లు రామజపం చేస్తున్న ఈ మూడు పార్టీల్లో  ఓటరు దేవుడు ఎవరికి జై కొడతాడో వేచి చూడాలి.