Jagtial Collector Shaik Yasmeen Basha: 
జగిత్యాల జిల్లాలోని ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నారసింహుడి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన శనివారం జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా పాల్గొన్నారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో అర్చకులు వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ తలపాగా చుట్టించుకున్నారు. నుదుట తిలకం దిద్దించుకొని... మంగళ వాయిద్యాలు వాయిస్తుండగా ధర్మపురి నరసింహస్వామి (Dharmapuri Lakshmi Narasimha Swamy Temple) వారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు తలంబ్రాల పల్లెం తలపై పెట్టుకుని కలెక్టర్ యాస్మిన్ బాషా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు. 


ఉచిత అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన కలెక్టర్
ఆ తర్వాత స్థానిక పురపాలక సంఘం ఆధ్వర్యంలో బ్రాహ్మణ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు భక్తులకు ఈ అన్నదానం కొనసాగనుంది. ఇక ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి దూరప్రాంతాల నుండి సైతం భక్తులు విచ్చేస్తున్నారు. పక్క జిల్లాల నుండే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి సైతం భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. ఆలయంలో స్వామివారి కల్యాణాన్ని వీక్షించేందుకు భక్తులందరికీ నేరుగా అవకాశం లేకపోవడంతో ధర్మపురి పట్టణంలో పెద్ద సంఖ్యలో ప్రత్యేక డిజిటల్ స్క్రీన్ లను ఏర్పాటు చేశారు. ధర్మపురి ఆలయంలో ఏర్పాటు చేసిన పలు సౌకర్యాల పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


ఆలయ అధికారుల ముందస్తు చర్యలు..
రెండవ రోజైన శనివారం శ్రీ యోగ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దీపాలతో అందంగా అలంకరించిన శేషప్ప కళా వేదికపై మువ్వూరు స్వాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే గతంలో లాగా కాకుండా ఆలయ కమిటీ సభ్యులు దేవాదాయ శాఖ అధికారులు ముందస్తు చర్యలకు పూనుకోవడంతో ఈసారి ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.


తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా ధర్మపురి మండలానికి చెందిన గ్రామం ధర్మపురి. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత కరీంనగర్ జిల్లాలో ఇదే మండలంలో ఉండేది. ఇది సమీప పట్టణమైన జగిత్యాల నుండి 31 కి. మీ. దూరంలో ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న ధర్మపురి పురపాలకసంఘంగా ఏర్పడింది.


చరిత్ర
ధర్మపురి క్షేత్రం సుమారు ఒక వేయి సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగియున్నది. పది, పదకొండవ శతాబ్దాలలో ధర్మపురమని పేరు కలిగిని ఈ క్షేత్రం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినట్లు తెలుస్తుంది. ఉత్తర తెలంగాణాలోని కరీంనగర్ జిల్లాకు ఉత్తరంగా 65 కిలోమీటర్ల దూరంలో, జగిత్యాలకు 30 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీతీరాన ఈ క్షేత్రరాజం ఉంది. ఇక్కడ గోదావరి నది దక్షిణవాహినిగా ప్రవహించి తన పవిత్రతను చాటుకుంటోంది. ఎంతో ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలు, చరిత్ర కలిగిన ఈ క్షేత్రం ప్రాచీన కాలంనుంచి వైదిక విద్యలకు, జ్యోతిశ్శాస్త్రానికి ప్రముఖ స్థలముగా పేరొంది నేటికీ సాంప్రదాయ వేదవిద్యలకు నెలవైయున్నది. శాతవాహనులు, బాదామి చాళుఖ్యులు కళ్యాణి చాళుఖ్యులు, కాలంలో ఈ ఆలయం ఉన్నతి స్థితిలో వున్నట్లు తెలుస్తున్నది. నిజాంల కాలంలో కూడా ఈ ఆలయం మంచి అభివృద్ధి పదంలో ఉండేది. క్రీ.శ 1309లో ధర్మపురి ఆలయాలపై ఉత్తరాదికి చెందిన రాజు దాడి చేసి నాసనం చేశాడని చరిత్ర చెబుతోంది.