Jagitial News: జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీలు కొప్పుల ఈశ్వర్, రమణలు హాజరయ్యారు. తెలంగాణలో రాబోయేది యుద్ధం అని.. కేసిఆర్ పాలనలో తెలంగాణ బొమ్మరిల్లులా తయారయిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బతుకమ్మ పండుగను కవిత ఉద్యమంలా నడిపారని చప్పుకొచ్చారు. కవిత అంటే ఓ దైర్యం, ఉద్యమం, బతుకమ్మ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. రాజకీయాల్లో చాలా కాలం పని చేసిన గొప్ప నేతలు జగిత్యాలలో ఉన్నారని.. కానీ వారి వల్ల ఏ లాభం జరగలేదంటూ కామెంట్లు చేశారు. కనీసం వారికి రోళ్ల వాగు గుర్తొంచ్చిందా, జగిత్యాలను జిల్లాగా చేయాలన్న అలోచన అయినా వచ్చిందా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత , కేసిఆర్ పాలన వల్లనే జగిత్యాల జిల్లాగా మారిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ వివరించారు.


కార్యకర్తల సభ అంటేనే మహాసభలా కనిపిస్తోందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. వేరే పార్టీల సభలన్నీ వెలవెల పోతున్నాయని అన్నారు. దీనికి స్ఫూర్తిని ఇచ్చింది సీఎం కేసీఆర్ అని, ఆయన ముఖ్యమంత్రి అయినందు వల్లే నీళ్లు, నిధులు, నియామకాల్లో రాష్ట్రం నంబర్ వన్ గా ఉందన్నారు. వాస్తవానికి దేశంలో ఎక్కడ కూడా ప్రత్యేక ఉద్యమాలు సక్సెస్ కాలేదని.. ముఖ్యంగా బీజేపీ కొన్ని రాష్ట్రాలు ఇచ్చినా ఉద్యమాలు చేపట్టి విజయం సాధించింది మాత్రం కేసీఆర్ యే నంటూ చెప్పుకొచ్చారు. నాడు చరిత్ర సృష్టించిన కేసీఆర్ ను ఇప్పుడు గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. మొన్ననే బీఆర్ఎస్ సర్కారు పోడు పట్టాలు ఇచ్చిందని, రాహుల్ గాంధీ ఇంకా అప్డేట్ కాలేదని కామెంట్లు చేశారు. మేమొస్తే పోడు పట్టాలిస్తాం అంటున్నారని ఎద్దేవా చేశారు. ఇక హైదరాబాద్ లో కాంగ్రెస్ నాయకులంతా దిగుతారట అంటూ విమర్శించారు. జగిత్యాలలో ఛైర్మెన్ అవకాశమొస్తే బీసీలకు ఇచ్చారా అని సూటిగా అడిగారు. అలాగే మీ మరదలుకు ఇచ్చుకున్నారంటూ బండి సంజయ్ ను ప్రశ్నించారు. రమణ పార్టీలోకి వచ్చాక పార్టీ మరింత బలపడిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాబోయే కాలంలో మరింత మెజారిటీ వచ్చే విధంగా కృషి చేయాలని సూచించారు. తెలంగాణ ఊహకు అందని విధంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఉక్కిరి బిక్కరి అవుతున్నారన్నారు. 


ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. జీవన్ రెడ్డి ఇదే చివరి అవకాశం అంటారని, ఇప్పటి వరకు మూడు సార్లు అదే అన్నారని ఎమ్మెల్సీ కవిత చెప్పుకొచ్చారు. నాయకులంటే ఇలాగే ఉంటారా అంటూ ఆమె ప్రశ్నించారు. జీవన్ రెడ్డి తీయటి మాటలు చెబుతారని ఆయన నమ్మారంటే మోసపోక తప్పదన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మోసం చేసే పార్టీ అంటూ కామెంట్లు చేశారు. అందుకే ఒకప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఉన్న పార్టీ ఇప్పుడు కొన్ని రాష్ట్రాలకే పరిమితం అయిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళా బిల్లు ఎక్కడుందని, రైతుల సంక్షేమం ఎక్కడుందని రాహుల్ గాంధీని అడగాలంటూ చెప్పుకొచ్చారు. ప్రచారానికి వెళితే బీడీ పెన్షన్లు, డబుల్ బెడ్ రూములు ఇస్తామని చెప్పండంటూ సూచించారు. త్వరలోనే రెండు పడక గదుల ఇళ్లు పంపిణీ చేస్తామన్నారు. వచ్చేది మన ప్రభుత్వమే, చేసేది మన ప్రభుత్వమే అంటూ వ్యాఖ్యానించారు. అల్లీపూర్ మండలం కావాలంటున్నారని.. సంజయ్ ను మళ్లీ గెలిపిస్తే తప్పుకుండా అల్లీపూర్ ను మండలం చేస్తామని వివరించారు. తెలంగాణ అంటే ఇప్పుడు విజయగాధ అని.. మళ్లీ జగిత్యాలలో బీఆర్ఎస్ యే గెలవాలన్నారు.