తెలంగాణ రాజకీయాలు అనూహ్యమైన మలుపులు తిరుగుతున్నాయి. హుజూరాబాద్‌లో పాదయాత్ర చేస్తున్న ఈటల రాజేందర్‌ను..  కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కలిశారు. ఆయనతో పాటు మరో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా ఉన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి బీజేపీ ఎన్నికల ఇంచార్జ్‌గా జితేందర్ రెడ్డి ఉన్నారు. ఆయన కలవడంతో పెద్ద విశేషం ఏమీ లేదు కానీ... కొండా విశ్వేశ్వర్ రెడ్డి కలవడం మాత్రం.. విశేషంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి..  తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయనకు పీసీసీ చీఫ్ ఇవ్వలేదని.. ఇవ్వరన్న అనుమానంతోనే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. 


కానీ రేవంత్ పీసీసీ చీఫ్ కాగానే... ఆయన మళ్లీ కాంగ్రెస్‌లో కొనసాగేందుకు ఆసక్తి చూపించారు. రేవంత్ రెడ్డి వెళ్లి అడగ్గానే సరే అన్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆయన హుజూరాబాద్ వెళ్లి ఈటల రాజేందర్‌తో సమావేశమయ్యారు. దీనిపైనే చర్చ జరుగుతోంది. ఆయన బీజేపీ వైపు చూస్తున్నారని కొంత మంది ప్రచారం చేస్తున్నారు. నిజానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ వైపు చూడాలంటే... ఈటలతో భేటీ కావాల్సిన అవసరం లేదు. పార్టీలో చేరేందుకు భేటీ కావాల్సిన వ్యక్తులు వేరే ఉంటారు. ఈటలతో సమావేశం కావాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు.. హుజూరాబాద్ వెళ్లారన్నది ఆసక్తికరంగా మారింది. ఈటల రాజేందర్ ... తెలంగాణ రాష్ట్ర సమితికి రాజీనామా చేసిన తర్వాత.. చాలా మందిని కలిశారు. అందులో కాంగ్రెస్ నేతలే ఎక్కువగా ఉన్నారు. 


దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం ఉద్ధృతంగా సాగింది.కానీ.. అప్పటికి పీసీసీ చీఫ్‌గా రేవంత్‌ని ఎంపిక చేయలేదు. ఎంపిక చేస్తారో లేదో కూడాక్లారిటీ లేదు. కోమటిరెడ్డి, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు అంటూ రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో.. కాంగ్రెస్ మార్క్ రాజకీయాల్లో ఇమడలేమని..  సపోర్ట్ ఉండదన్న అనుమానంతో ఈటల బీజేపీ వైపు చూశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తిరస్కరించలేని ఆఫర్ ఇవ్వడంతో ఆయన కూడా అంగీకరించారు. ఆ విధంగా బీజేపీలో చేరిపోయి.. ప్రచారం కూడా చేస్తున్నారు. కానీ.. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయ వాతావరణం మారిపోతోంది. దీంతో.. బీజేపీ తరపున పోటీ అంటే... ఇబ్బందేనన్న అభిప్రాయం.. ఈటల వర్గీయుల్లో ఏర్పడుతోందని చెబుతున్నారు.


 ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయమని.. రేవంత్ రెడ్డి ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సమాచారాన్నే... కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. ఈటల వద్దకు తీసుకెళ్లారని.. దీనిపైనే చర్చలు జరిగి ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా.. ఇటీవలి కాలంలో బీజేపీపై కాస్త అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ విషయంలో అగ్రెసివ్‌గా వెళ్లడం లేదని.. ఆయన భావిస్తున్నారు. సాఫ్ట్ నేచర్‌తో కేసీఆర్‌ను ఎదుర్కోవడం సాధ్యం కాదని..రేవంత్ రెడ్డి లాంటి దూకుడైన నేతతోనే సాధ్యమని అంచనా వేస్తున్నారు. ఈ ఊహాగాలను నిజం చేసేలా..  ఈటలతో భేటీ తర్వాత మాజీ ఎంపీలు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను ఎలా ఎదుర్కోవాలన్న అంశంపైనే చర్చించామని చెప్పుకొచ్చారు. మొత్తానికి రేవంత్ రెడ్డి హుజూరాబాద్ బై ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపు.. ఏదో ఓ గేమ్ ప్లాన్ అమలు చేస్తారన్న ప్రచారం మాత్రం.. ఉద్ధృతంగా సాగుతోంది.