Bandi Sanjay About Fake Votes | కరీంనగర్: దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు చేస్తున్న "దొంగ ఓట్లు" ఆరోపణలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) చేసిన "దొంగ ఓట్లతో బీజేపీ నేతలు గెలిచారు" అనే ఆరోపణల్లో నిజం లేదన్నారు. తెలంగాణలో అధికారం మీ చేతిలో ఉంది కదా. అలాగైతే వెంటనే దొంగ ఓట్ల జాబితాను బయటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దొంగ ఓట్లను తొలగించాలని ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాయాలని బండి సంజయ్ అన్నారు. దొంగ ఓట్ల రద్దు తరువాత అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళదాం. కాంగ్రెస్ కనుక ఎన్నికల్లో గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన ఛాలెంజ్ స్వీకరించగలదా? అని బండి సంజయ్ సవాల్ విసిరారు.
కరీంనగర్ ప్రజలను అవమానించడమే?
తాను కరీంనగర్ నుంచి 2,25,000 ఓట్ల మెజారిటీతో గెలిచానని.. దొంగ ఓట్ల వల్ల అని మాట్లాడడం, కరీంనగర్ ప్రజలను అవమానించడం కాకపోతే మరేంటి?" అని బండి సంజయ్ మండిపడ్డారు. మహేశ్ గౌడ్‌కు చరిత్ర గుర్తుండదు అని ఎద్దేవా చేశారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను చూస్తే 'గజిని' సినిమా గుర్తొస్తుంది. ఒక్కసారి బండి సంజయ్‌ను బీసీ అని విమర్శిస్తారు. మరి ఇప్పుడు దేశ్‌ముఖ్ అని నన్ను పిలుస్తున్నారు. అంటే మహేష్ గౌడుకు తాను చెప్పింది ఏమిటో కూడా గుర్తుండదు అని ఎద్దేవా చేశారు. ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గానైనా గెలవని టీపీసీసీ చీఫ్‌కు ఓట్ల చోరీ గురించి ఏమి తెలుస్తుంది?" అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
పంచాయతీలకు నిధులు ఇచ్చిందెవరు?
"20 నెలల పాలనలో ఒక్క పైసా కూడా పంచాయతీలకు నిధులు ఇవ్వని పార్టీ కాంగ్రెస్. కేంద్రం నిధుల కోసమే పంచాయతీ ఎన్నికలు జరుపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిధులిచ్చింది కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే. ఓట్ల కోసం యాచన చేయాల్సిన స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. హిందువులపట్ల చులకన ధోరణితో వ్యవహరిస్తూ, మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. నేను గెలిచానంటే అది హిందూ ఓట్లతోనే. తెలంగాణలో బలమైన హిందూ ఓటు బ్యాంకు నిర్మించడమే మా లక్ష్యం" అని బండి సంజయ్ స్పష్టం చేశారు.
మత రాజకీయాలపై విమర్శలు
కాంగ్రెస్ మతం పేరుతో ఓట్లు అడిగే బిచ్చగాళ్లలా మారింది. మసీదుల్లోకి వెళ్లి టోపీ పెట్టుకుని ప్రార్థనలు చేస్తూ కొందరు నేతలు నటిస్తారు. కానీ హిందువులు గణేశ్ ఉత్సవాల్ని జరుపుకోవాలన్నా కూడా షరతులు పెడతారు. బీజేపీ అధికారంలోకి వస్తే చట్టపరంగా గణేశ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం. హిందూ ధర్మ పరిరక్షణ కోసం బీజేపీ ఎల్లప్పుడూ పోరాడుతుంది" అన్నారు.
రోహింగ్యాలపై ఆరోపణలు
"రోహింగ్యాలు 2014కి ముందే దేశంలోకి అక్రమంగా వచ్చారు. అప్పట్లో పాలకులెవరో మర్చిపోకండి. అప్పుడే దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నదని ఆ పార్టీ నేతలకే గుర్తులేదు. ఇప్పుడు వారిని వెనక్కి పంపిద్దామంటే కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి సహకరించడంలేదు. మేము అయితే సరిహద్దుల్లో ఫెన్సింగ్ పెట్టాము, అక్రమ వలసను అడ్డుకుంటున్నాం. విదేశీయులు పాస్‌పోర్టు, వీసా గడువు ముగిశాక వాళ్లను దేశం నుంచి వెనక్కి పంపిస్తున్నామని" బండి సంజయ్ అన్నారు.