Union Minister Bandi Sanjay Responds on BJP Telangana State President post | బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి రేసులోనే తాను లేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధిష్టానం తనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పెద్ద బాధ్యతలను అప్పగించిందని, ప్రస్తుతం ఆ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నానని చెప్పారు. తనకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగిస్తారని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.


అధిష్టానం నిర్ణయమే ఫైనల్


తనకు మళ్లీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలంటూ జరుగుతున్న ప్రచారమంతా ఊహాగానాలేనని బండి సంజయ్ కొట్టిపారేశారు. పార్టీ నాయకత్వం అసలు రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఆలోచించడం లేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష నియామకం విషయంలో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం ఫైనల్ అని, అందరూ దానికి కట్టుబడి ఉండాలన్నారు. 


కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కలిసిన జర్నలిస్టులు


కరీంనగర్ జిల్లా ఎన్నికల్లో విజయం సాధించిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (IJU) నాయకులు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన టీం జిల్లాలోని జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా  మీడియా ప్రతినిధులతో బండి సంజయ్ మాట్లాడుతూ.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుల నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవి వరకు సమిష్టి నిర్ణయాల మేరకే జరుగుతాయి. ప్రస్తుతం సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంకా జిల్లా, రాష్ట్ర అధ్యక్ష నియామకాల అంశం చర్చకు రాలేదన్నారు. అయితే కొందరు తనపై అభిమానంతో రాష్ట్ర అధ్యక్షుడిగా తనకు బాధ్యతలు అని ప్రచారం చేస్తున్నారు. పార్టీ అధిష్టానం నాకు హోంశాఖ సహాయ మంత్రిగా పెద్ద బాధ్యతలు ఇచ్చింది. ఆ శాఖలో పనిచేసి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నా. అంతే తప్ప ప్రస్తుతానికి నేను రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులోనే లేను. ఆ ప్రచారంలో వాస్తవం లేదు అన్నారు బండి సంజయ్.


కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు


మీడియాలో తనకు మళ్లీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అని వార్తలు రావడంతో కొందరు కావాలనే తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. అసలు తాను పార్టీ అధ్యక్ష రేసులోనే లేనని, హైకమాండ్ అలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదని చెప్పారు. దయచేసి మీడియా, సోషల్ మీడియా మిత్రులు అవాస్తవాలను ప్రచారం చేయవద్దని కోరారు. ఇలాంటి వార్తలు రాయడం ద్వారా బీజేపీకి నష్టం జరిగే ప్రమాదముందన్నారు. అదే సమయంలో వ్యక్తిగతంగా తనకు కూడా నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ఇకపై అలాంటి కథనాలు రాయొద్దని బండి సంజయ్ కోరారు. బీజేపీ హైకమాండ్ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని, వారు తనపై నమ్మకం ఉంచి అప్పగించే ఏ బాధ్యత అయినా సమర్థవంతంగా చేసేందుకు ఎల్లప్పుడూ తాను సిద్ధమేనని బండి సంజయ్ పేర్కొన్నారు.


Also Read: MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత