ప్రశాంతంగా మొదలైన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో క్రమంగా గొడవలు, ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల టీఆర్ఎస్-బీజేపీ కార్యకర్తలు మధ్య వాగ్వివాదం జరిగింది. వీణవంక మండలం గన్ముక్కుల పోలింగ్ బూత్ వద్ద టీఆర్‌ఎస్‌ నాయకుడు కౌశిక్ రెడ్డి, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని కౌశిక్‌ రెడ్డిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, గ్రామస్థులు కూడా కౌశిక్ రెడ్డి పోలింగ్ బూత్‌కు రావడాన్ని వ్యతిరేకించారు. ఆయన పోలింగ్ ఏజెంట్ అని, తనకు ఏజెంట్ పాస్ ఉందని కౌశిక్ రెడ్డి చెప్పగా.. స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కౌశిక్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.


మళ్లీ ఆయన టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి అక్కడికి చేరుకోవడంతో బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఊరికే తమ ప్రాంతానికి ఎందుకు వస్తున్నారని, స్థానికేతరులకు ఇక్కడ ఏం పని అని కౌశిక్ రెడ్డిని ప్రశ్నించారు. అయితే, తాను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అని ఎక్కడికైనా వచ్చే హక్కు తనకు ఉందని కౌశిక్ రెడ్డి వారికి క్లారిటీ ఇచ్చారు. అనంతరం పోలీసులు సర్ది చెప్పడంతో మరోసారి కౌశిక్ రెడ్డి వెనక్కి వెళ్లారు.


Also Read:  హైదరాబాద్‌లో యువకుడు ఘాతుకం.. యువతి చేతులు, గొంతు కోసి దాడి


జమ్మికుంటలో..
మరోవైపు, జమ్మికుంట పట్టణంలో టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఘర్షణకు దిగారు. టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మికుంటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గల 176వ పోలింగ్ బూత్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికేతరుల ప్రచారాన్ని బీజేపీ నేతలు అడ్డుకున్నారు. దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.


Also Read: V Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి కన్నుమూత.. గుండెపోటుతో హఠాన్మరణం 



కోర్కల్‌లో ఘర్షణ
వీణవంక మండలంలో కోర్కల్‌లో కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద ఓ గ్రామ సర్పంచ్ ప్రచారం నిర్వహిస్తున్నారనే బీజేపీ కార్యకర్తలు ఆరోపణలు చేశారు. దాంతో వెంటనే బీజేపీ శ్రేణులు సర్పంచ్‌ను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. ఓ దశలో ఇరు వర్గాల వారు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. పోలీసులు, భద్రతా సిబ్బంది జోక్యం చేసుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు.


Also Read: పుట్టింటికి వచ్చిన ఇద్దరు యువతులు.. చివరికి చెరువులో మూడు శవాలు, ఏం జరిగిందంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి