హుజూరాబాద్ ఉపఎన్నిక గురించి చర్చ జరిగితే... ముందుగా పాపం.. కౌశిక్ రెడ్డి అని అనుకునే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఉంటే... గత ఎన్నికల్లో ఈటల రాజేందర్‌కు గట్టి పోటీ ఇచ్చిన నేతగా..ఆయనకు ప్రాధాన్యం ఉండేది. కానీ ఎందుకో కానీ... ఆయన టీఆర్ఎస్ వైపు మొగ్గారు. అదీ కూడా.. కాంగ్రెస్‌లో  ఉండి.. కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహించారు. దీంతో ఇమేజ్ మసకబారింది. ఇప్పుడు టీఆర్ఎస్‌లో చేరారు. కానీ ప్రయోజనం ఉంటుందా లేదా అన్నది చెప్పడం కష్టమే. ఆయనకు టిక్కెట్ మాత్రం ఇవ్వబోవడం లేదని.. కేసీఆర్ చేసిన ప్రసంగంలోనే ఉందని..  టీఆర్ఎస్ నేతలు విశ్లేషిస్తు్నారు. 


హుజూరాబాద్ టీఆర్ఎస్ టిక్కెట్ తనకేనని కాంగ్రెస్‌లో ఉండి... ప్రచారం చేసుకున్న పాడి కౌశిక్ రెడ్డికి.. ఆశ నిరాశ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అట్టహాసంగా తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో... కేసీఆర్‌తో కండువా కప్పించుకుని అధికారికంగా టీఆర్ఎస్ సభ్యుడయ్యారు. అయితే ఈ సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం.. ఆయనకు షాక్ ఇస్తున్నాయి. పెద్ద పదవే ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు కానీ...  టిక్కెట్ గురించి మాత్రం చెప్పలేదు.  హుజూరాబాద్ నుంచి కౌశిక్ రెడ్డి పోటీ చేస్తాని ఆయన మాట మాత్రంగా కూడా చెప్పలేదు సరి కదా.. భవిష్యత్‌లో మంచి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంటే.. ఇప్పుడు హూజారాబాద్ టిక్కెట్ ఇవ్వలేకపోతున్నట్లుగా కేసీఆర్ నేరుగానే చెప్పేశారని టీఆర్ఎస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 


హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్ఎస్‌లో చేరుతున్నానని కౌశిక్ రెడ్డి ప్రకటించారు. కానీ ఆయన... టీఆర్ఎస్ టిక్కెట్ వస్తుందని గట్టి నమ్మకం పెట్టుకున్నారు. కేటీఆర్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలు ఉపయోగపడతాయనుకున్నారు. కానీ.. కేసీఆర్ ఆలోచనలు కౌశిక్ రెడ్డి దగ్గర ఆగలేదని తెలుస్తోంది. చిన్న పదవి ఇచ్చి సరిపెట్టబోనని కూడా హామీ ఇచ్చారు. ఏ విధంగా చూసినా.. కేసీఆర్ మాటలు.. కౌశిక్ రెడ్డికి టిక్కెట్ వరకూ రాలేదు.  టీఆర్ఎస్‌తో టచ్‌లో ఉండి.. టీఆర్ఎస్ చెప్పినట్లుగా.. ఈటల రాజేందర్‌పై ఆరోపణలు చేసి.. రచ్చ చేసినందుకు.. అలా వదిలేయకుండా పార్టీలో చేర్చుకుని మేలు చేస్తున్నామని.. టిక్కెట్ ఆశించడం అత్యాశే అవుతుందన్న సంకేతం.. ఆయనకు నేరుగా వెళ్లిందని.. కాంగ్రెస్ వర్గాలు కూడా.. చర్చించుకుంటున్నాయి. 


పాడి కౌశిక్ రెడ్డి ఆడియోటేపులు వెలుగులోకి వచ్చిన తర్వాత...  చోటు చేసుకున్న పరిణామాలు ఆయనకు మైనస్‌గా మారాయి. ఓ పార్టీలో ఉండి మరో పార్టీకి కోవర్ట్‌గా పని చేశారన్న విమర్శలను ఆయన ఎదుర్కొన్నారు. వాటిని ఆయన తిప్పికొట్టలేకపోయారు. ఇది ఆయన ఇమేజ్‌పై మచ్చపెట్టింది. టీఆర్ఎస్ అధినేత కూడా ఆయనను మనస్ఫూర్తిగా నమ్మరని అంటున్నారు.  కేసీఆర్..  పాడి కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని హుజూరాబాద్‌లో ఎప్పుడూ పరిశీలించలేదని అత్యుత్సాహంగా.. ముదే .. తన అభ్యర్థిత్వాన్ని తానే ప్రకటించుకుని కౌశిక్ రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకున్నారని టీఆర్ఎస్ లోని ఓ వర్గం సెటైర్లు వేస్తోంది.  మొత్తానికి కౌశిక్ రెడ్డి ఆటలో అరటి పండు అయ్యారని మాత్రం తెలంగాణ భవన్‌ లో చర్చ జరుగుతోంది.