ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహదేవపూర్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అన్నారం బ్యారేజీ వద్ద ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. మొన్న కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు రావడంతో నీటితోపాటు ఇసుక కూడా కొట్టుకు వచ్చింది. ఇసుక పెద్ద ఎత్తున బ్యారేజీ గేట్ల వద్ద జమ కావడంతో నీటి పారుదల శాఖ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. బ్యారేజీ గేట్లకు ఇరువైపులా భారీగా ఇసుక మేట వేయడంతో కొన్ని గేట్లు మూసి వేయలేని పరిస్థితి నెలకొంది. అయితే ఇలాంటి వరదలు భవిష్యత్తులోనూ వచ్చే అవకాశం ఉండడంతో ఇసుక మేట సమస్యను శాశ్వతంగా ఎలా పరిష్కరించాలనే విషయంపై నీటి పారుదల శాఖ అధికారులు తర్జనభర్జనా పడుతున్నట్లు సమాచారం. మూడేళ్ల క్రితం గోదావరికి నాలుగు లక్షల క్యూసెక్కుల వరద నీరు రావడంతో అప్పుడు కూడా ఇసుక వల్ల గేట్లకు నష్టం వాటిల్లినట్టు తెలిసింది. అయితే ఆ సమయంలో కాంట్రాక్టర్‌గా ఉన్న సంస్థ 80 కోట్ల ఇన్సూరెన్స్ కోరగా ఢిల్లీకి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిపుణులు పరిశీలించి తమ నివేదిక అందించారు.
20 కోట్ల వరకు మాత్రమే ఇన్సూరెన్స్ చేసుకోవచ్చని నివేదికలో వెల్లడించారు. దీన్నిబట్టే సమస్య ప్రతీ యేడు ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ కి (CDO) సంబంధించిన ఇంజినీర్లు కూడా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్న సమయంలో పరిశీలించి ఇసుక మేట సమస్య ఏ స్థాయిలో ఉందో అప్పుడే ముందస్తు ప్రణాళికలు వేసుకోవాలని సూచించినట్లు తెలిసింది. ఒకవైపు నదికి ఎనిమిది మీటర్ల వరకు తేడా వస్తుండడంతో సహజంగానే పెద్ద ఎత్తున అవుతుందని వారు అభిప్రాయ పడ్డారట. ఇక ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున వరద రావడంతో ఈ సమస్య మరింత జటిలం అయింది. ఇందులో దాదాపు 66 గేట్లకు గాను 25 గేట్ల వద్ద ఈ సమస్య ఎక్కువగా ఉంది.
ఇసుక తరలింపు సాధ్యమా??
నిజానికి ఇంత భారీ ఎత్తున జమ అయిన ఇసుక వల్ల కొన్ని గేట్లు మూసి ఉంచి మరి కొన్నిటిని నీటి పారుదల శాఖ అధికారులు తెరిపించారు. వీటితోపాటుగా దిగువ ప్రాంతానికి ఇసుక వెళ్లి పోయినట్లయితే తిరిగి అన్ని గేట్లు మూసేసే అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ కూడా ఇక్కడ ఇసుకను తొలగించి తరలించే అంశంపై పరిశీలన చేస్తున్నట్లు తెలిసింది. ముందుగా అసలు ఎన్ని క్యూబిక్ మీటర్ల ఇసుక వెలికి తీయాల్సి ఉంటుందో ఒక రిపోర్టు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు సూచించినట్లు సమాచారం. అలాగే దీని ప్రకారం రానున్న రోజుల్లో కూడా ఇదే సమస్య రిపీట్ అయితే ఎంత త్వరగా ఈ సమస్య పరిష్కరించగలరనే అంశంపై ఒక అంచనాకు రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పంపు హౌస్ ని వచ్చే నెల వరకు పని చేసే విధంగా చేయాలంటే బ్యారేజీలో కూడా నీటిని నిల్వ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే వీలైనంత త్వరగా ఇసుక సమస్యను పరిష్కరించడానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు.