Karimnagar Man Social Service | సమాజంలో ఎంతోమంది సమాజ సేవకులను చూసే ఉంటాం. రకరకాల సేవా సంస్థల పేరుతో సమాజంలో నిరుపేదలకు సహాయం చేసేందుకు నిత్యం ఏదో ఒక రకమైన కార్యక్రమం పేరుతో కొంతమంది సమాజ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజ సేవ అంటే జన్మదిన సందర్భంగా రక్తదానం చేయడం అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం లేక సైకిళ్లను పంచి పెట్టడం లేదా దుస్తులను పంచిపెట్టడం చేస్తుంటారు. ఇలాంటివన్నీ కూడా సామాన్యంగా ఏవైనా స్వచ్ఛంద సేవా సంస్థలు లేక మధ్యతరగతి పై కుటుంబాలు ధనిక కుటుంబాలు చేస్తుంటారు. అయితే ఇతను మాత్రం వీరందరిలా కాదు రోడ్లపై ఎక్కడైనా గుంతలు కనిపించాయంటే చాలు వెంటనే ఓ ఆటోలో మట్టిని నింపి తీసుకొచ్చి ఆ గుంతను పూడ్చేస్తారు. ఇలా గత 15 సంవత్సరాలుగా చేస్తున్నాడు. నిరుపేద కుటుంబంలో జన్మించి ఆటో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్న ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలంటే మాత్రం ఈ స్టోరీ చదవాల్సిందే.




కరీంనగర్ జిల్లా చొప్పదండి గ్రామానికి చెందిన అడ్లూరి దుర్గయ్య ఆటో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నారు. ఆయనకు సమాజసేవపై మక్కువ ఎక్కువ అందువల్లే రోడ్లపై ఎక్కడైనా చిన్న గుంత కనిపించింది అంటే చాలు వెంటనే తన ఆటోను తీసుకుపోయి ఓ గడ్డపార, ఓ పార సాయంతో తానే మట్టిని ఆటోలో నింపుకొని ఆ గుంతలను పూడ్చేస్తాడు. అయితే చొప్పదండి ధర్మారం ప్రాంతంలో క్వారీలు అధికంగా ఉండడం లారీలు తిరగడంతో రోడ్లు పూర్తిగా పాడవుతున్నాయి. ఈ క్రమంలో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. నిత్యం వందల సంఖ్యల్లో ప్రయాణించే ఈ రోడ్డుపై నిరుపేదలు కూడా ప్రయాణిస్తుంటారు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు యోచిస్తుంటారు. అయితే తన కళ్ళ ముందు ఎన్నో ప్రమాదాలు చూసి తట్టుకోలేక పోయారు దుర్గయ్య. ప్రమాదాల్లో మరణించిన వారి పార్థివ దేహాలను కూడా కొంతమంది నిరుపేదలవి ఆయనే పూడ్చి పెట్టారట.



వడ్లూరి దుర్గయ్య చొప్పదండి గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా ఆటో ట్రాలీ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని ఆయనకు సంతానం ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ ఆటో నడుపుతూనే వారిని ప్రయోజకుల చేశారని గ్రామస్తులు తెలిపారు. అయితే చొప్పదండి చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కడ గుంతలు కనిపించిన వాటిని తన సొంత ఖర్చుతో ఆ గుంతలను పూడుస్తారని ఎలాంటి లాభాన్ని ఆశించకుండా ఇలా గత 15 సంవత్సరాలుగా చేస్తున్నారని అంటున్నారు గ్రామానికి చెందిన ప్రసాద్. ఎలాంటి లాభాన్ని ఆశించకుండా సమాజం కోసం తన వంతు సహాయంగా కృషి చేస్తున్న ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించాలన్నారు. అయితే ఈ రోడ్లను పూడ్చడం ప్రభుత్వం పని అయినా తాను రోడ్లపై జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని తన వంతు కృషి చేస్తున్నారని అంటున్నారు గ్రామస్తులు. 



గత 15 సంవత్సరాలుగా దుర్గయ్య చేస్తున్న సమాజ సేవను గుర్తించిన కొంతమంది సమాజ సేవకులు ఆయనను సన్మానిస్తున్నారు. అయితే ప్రస్తుతం దుర్గయ్య ఆటో పాడైపోయే స్థితిలో ఉంది, కావున ఎవరైనా దుర్గయ్యను ఆదుకోవాలని.. ఆయనను ఎవరైనా ఆదుకుంటే సమాజం కోసం కృషి చేస్తారని గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు. మరి మనం కూడా ఈ పెద్దాయన చేస్తున్న సేవకు ఒక హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.