Godavari Water Level: రాష్ట్రంలో శని, ఆది వారాల్లో కాస్త వర్షాలు తగ్గాయి. అంతకు ముందు మూడు రోజుల పాటు ఎడితెరిపి లేకుండా వర్షం కురిసింది. రాష్ట్రంతో పాటు ఎగువ ప్రాంతాల్లోనూ వర్షం కురవడంతో గోదావరి నదికి పెద్ద ఎత్తున వరద వచ్చింది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరిగింది. ప్రస్తుతం ఈ నీటిమట్టం కాస్త తగ్గుముఖం పట్టింది. భద్రాచలం వద్ద 43.6 అడుగుల వరకు పెరిగిన గోదావరి నీటిమట్టం మధ్యాహ్నం 12 గంటలకు 43.4 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. రెండు అంగుళాల గోదావరి నీటిమట్టం స్వల్పంగా తగ్గి ప్రవాహం కొనసాగుతోంది. ఇలాగే వరద ప్రవాహం తగ్గితే మూడు రోజుల క్రితం ఇచ్చి మొదటి ప్రమాద హెచ్చరికను తొలగిస్తారని ఖమ్మం జిల్లా కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు. ప్రస్తుతం గోదావరి నుంచి 9,51,120 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు వివరించారు. దీంతో పరివాహక ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు పేర్కొన్నారు. 


ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఏర్పడితే అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయాలని, ప్రజలు ఇళ్లన నుంచి బయటకు రావొద్దని సూచించారు. వర్షాల వల్ల పొంగి పొర్లుతున్న వాగులు దాటొద్దని అన్నారు. అలాగే ప్రజలందరూ అధికారులు చెప్పే సూచనలు కచ్చితంగా పాటించాలని అప్పుడే ఎలాంటి ఇబ్బందుల పాలవరని వివరించారు. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తమవుతూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అల సూచించారు. 


మూడు రోజుల క్రితమే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ


భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవడంతో మూడు రోజుల క్రితం మొదటి ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు అధికారులు. ఎగువ ప్రాంతాలతో పాటు నదీ పరివాహక ప్రాంతాల్లో విపరీతంగా వర్షాలు కురవడంతో వరదలు పెరిగాయి. దీని వల్ల నీటిమట్టం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. అయితే భారీ వరదల వల్ల నీటిమ్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాలతో సీతారమస్వామి ఆలయ పరిసరాల్లోకి కూడా వర్షం నీరు చేరింది. దీంతో భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అన్నదాన సత్రం వద్ద భారీగా నీరు నిలిచింది. దీంతో అన్నదాన కార్యక్రమాన్ని ఆపేశారు. నీటిమట్టం పెరగడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కలెక్టర్ ప్రియాంక వరద పరిస్థితిపై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చించారు. పునరావాస కేంద్రాలను సిద్దం చేశారు.







24 గంటలూ పని చేసేలా కంట్రోల్ రూంల ఏర్పాటు


24 గంటల పాటు జిల్లా అధికారులంతా పని చేసేలా కలెక్టరేట్ తో పాటు కొత్తగూడెం, భద్రాచలం, ఆర్టీఓ కార్యాలయాలు, చర్ల, దమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరుపినపాక తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. గోదావరిలో వరద పోటెత్తుతున్న క్రమంలో ఎవరి ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని, ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ ను ఆదేశించారు. అలాగే భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరుకుంటే రెండో ప్రమాద హెచ్చరికలను జారీ చేస్తారు. అదే 53 అడుగులకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేస్తారు.