Karimnagar News: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పాఠశాలలకు విద్యా సంవత్సరం ప్రారంభం అయినప్పటి నుంచి నిధులు లేక ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల క్రీడా రంగానికి రాష్ట్ర విద్యాశాఖ వివిధ రకాల నిధులు మంజూరు చేసింది. స్కూల్ ల నిర్వహణకు నయా పైసలు లేని కారణంగా ఇప్పటి వరకు చాలా ఇక్కట్లు ఎదుర్కొంటున్న ప్రధానోపాధ్యాయుల సమస్య తీరింది. మరోవైపు మండల విద్యా వనరుల కేంద్రాలు స్కూల్ కాంప్లెక్సులకు సైతం ప్రతి సంవత్సరం రావాల్సిన నిధులు మంజూరు అయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని స్కూల్లో ఎమ్మార్సీలు, స్కూల్ కాంప్లెక్స్ లకు విద్యా సంవత్సరంలో రావాల్సిన నిధుల్లో 50% నిధులను మంజూరు చేస్తూ సమగ్ర శిక్ష అధికారులు ఉత్తర్వులను జారీ చేశారు. గత విద్యా సంవత్సరంలో పాఠశాలల నిర్వహణకు కేటాయించిన నిధులు కొన్ని స్కూల్లో ఎస్ఎమ్ సీ ఖాతాల్లో నిలువ ఉన్నాయి. దీంతో వాటిని పాఠశాలల ముగింపు దశలో రాష్ట్ర విద్యాశాఖ వెనక్కి తీసుకుంది.
ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలకు అనేక సమస్యలు..
కరీంనగర్ జిల్లాలో మాత్రం వెనక్కి తీసుకున్న ఆ నిధులను పాఠశాలల విద్యుత్ బిల్లుల బకాయిల చెల్లింపునకు వినియోగించారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత నిధులు మంజూరు కాని కారణంగా పాఠశాలలు నిర్వహణ భారంగా మారింది. సమావేశాలు, కార్యక్రమాల నిర్వహణ బిల్లుల చెల్లింపునకు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలకు తలకు మించిన భారంగా మారింది. ఈ క్రమంలోని నిధులు మంజూరు కావడంతో వారి వారందరికీ కాస్త ఉపశమనంగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జడ్పీ, ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలు, గిరిజన సంక్షేమ పాఠశాలలు, అంధుల, బధిరుల పాఠశాలలు నిర్వహణకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో మొదటి విడతగా 50 శాతం నిధులను మంజూరు చేశారు. దీంతో చాక్ పీస్ లు, రిజిస్టర్లు, స్టేషనరీ, మైనర్ మరమ్మత్తులు, బిల్లుల చెల్లింపు ప్రయోగ పరికరాల కొనుగోలు వంటి సమస్యలు తీరని పాఠశాలలో విద్యార్థులు మొత్తం సంఖ్య ఆధారంగా రూ. 10 వేల నుంచి రూ.50 వేల వరకు ఒక పాఠశాలకు ప్రతి సంవత్సరం నిర్వహణ నిధులను సమగ్ర శిక్ష చెల్లిస్తుంది.
54 లక్షల 12 వేల నిధులు మంజూరు..
మొదటి దఫాగా 50% నిధులను మంజూరు కాగా ఎస్ఎమ్సీ ఖాతాలో ఈ నిధులు జమ కానున్నాయి. ఇలా బడుల నిర్వహణకు 3.22 కోట్లు చెల్లించారు. బోధన బలోపేతం చేసే పాఠశాలల సముదాలకు 27.6 నిధులు మొదటి దఫగా మంజూరు అయ్యాయి. మొత్తం 54 లక్షల 12 వేల నిధులు మంజూరు కావాల్సి ఉండగా సగం మంజూరు చేశారు. ఒక్కో స్కూల్ కాంప్లెక్స్ లో ఉపాధ్యాయ శిక్షణ సమావేశాలు ఇతర బిల్లులు, స్టేషనరీ, ఇటువంటి వాటికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఏడాదికి ఒక్కో స్కూల్ కాంప్లెక్స్ కు 33,000 చెల్లిస్తారు. ఇప్పుడు 16,500 చొప్పున మొదటి విడతగా విడుదల చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కరీంనగర్ జిల్లాలో 665 స్కూళ్లు, జగిత్యాల జిల్లాలో 796 స్కూళ్లు, పెద్దపల్లి జిల్లాలో 556 స్కూళ్లు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 496 స్కూళ్లు ఉన్నాయి.