వారంతా సివిల్ సర్వీసెస్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగారు. ఒకరు మొదటి ప్రయత్నంలోనే సాధించగా మరొకరు మూడేళ్లపాటు పోరాడారు. మరొక ఇద్దరు దాదాపు ఆరేళ్లు కష్టపడి సివిల్స్ క్రాక్ చేశారు. పటిష్టమైన ప్రణాళికకు సమయపాలన తోడైతే విజయాలు సొంతమవుతాయని నిరూపించారు.
ఒక్కొక్కరిదీ ఒక్కో విజయగాథ...
సివిల్ 2021 ఫలితాల్లో కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన విద్యామరి శ్రీధర్ 336 వ ర్యాంక్ సాధించారు. జగిత్యాలలోని బీర్పూర్ మండలం చర్లపల్లికి చెందిన గుగులోతు శరత్ నాయక్ 374 ర్యాంక్ తొలి ప్రయత్నంలోనే సాధించారు. రామగుండం మండలం ఎన్టీపీసీకి చెందిన పూజారి శ్రవణ్ కుమార్ 521 ర్యాంక్, హుజురాబాద్‌కి చెందిన మాడిశెట్టి అనన్య 544 ర్యాంకు సాధించారు.
కానిస్టేబుల్ కొడుకు సివిల్స్ సర్వెంట్
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్‌లో ఉంటున్న కానిస్టేబుల్ రాంగోపాల్ మల్లేశ్వరి దంపతుల చిన్న కొడుకు విద్యామరి శ్రీధర్ 336 ర్యాంకు పొందారు. రాంగోపాల్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తుండగా.... తల్లి మాములు గృహిణి. శ్రీధర్ పదో తరగతి వరకు కరీంనగర్‌లోని వింధ్యవాలి పాఠశాలలో తర్వాత ఇంటర్ నారాయణ కళాశాలలో చదివారు. హైదరాబాద్‌లో మాతృశ్రీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. రెండేళ్ల పాటు చెన్నైలో పనిచేసి 2015 నుంచి సివిల్స్ లక్ష్యంగా చదివారు. ఇప్పటివరకు ఆరు సార్లు అటెంప్ట్ చేసి చివరగా 336 వ ర్యాంక్ సాధించారు.
అంగన్వాడీ టీచర్ కుమారుడు సివిల్స్ విజేత
జగిత్యాల నుంచి సివిల్స్ ల మెరిసిన గుగులోతు శరత్ నాయక్‌ది మరో సక్సెస్ స్టోరీ. మారుమూల ప్రాంతానికి చెందిన శరత్ తండ్రి భాశ్యా నాయక్ ఒక రైతు కూలీ. తల్లి అంగన్వాడీ టీచర్. శరత్ చెర్లపల్లిలో ప్రాథమిక పాఠశాల పూర్తి చేయగా జగిత్యాలలో ఇంటర్ వరకు చదివారు. తర్వాత వెటర్నరీలో పిడిఎస్ పూర్తి చేసి గోల్డ్ మెడల్ సైతం సాధించారు. తన మిత్రులతో కలిసి హైదరాబాద్‌లో రూమ్ తీసుకుని కోచింగ్‌కి అటెండ్ అయిన శరత్ మొదటి ప్రయత్నంలోనే 374 ర్యాంకు సాధించారు.
ముచ్చటగా మూడో ప్రయత్నంలో 521 ర్యాంక్
రామగుండం మండలం ఎన్టీపీసీకి చెందిన పూజారి శ్రవణ్ కుమార్ సైతం మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు. తండ్రి రాఘవేంద్రరావు రామగుండం లోని ఎన్టిపిసిలోనున్న సిఐఎస్ఎఫ్ ఫైర్ విభాగంలో ఏఎస్ఐగా పని చేస్తున్నారు. తల్లి లలితమ్మ గృహిణి. 2017లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వెంటనే సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యారు శ్రవణ్. రెండు సార్లు సొంతంగా చదివి చేసినా రాకపోవడంతో మూడో ప్రయత్నంలో మరింత శ్రద్ధగా ప్రిపేర్ అయ్యారు. ఈసారి 521 సాధించారు. తండ్రి స్పూర్తితో ఇండియన్ పోలీస్ సర్వీస్ చేయాలన్న ఆశయంతోనే కష్టపడి చదివానని తన తల్లిదండ్రుల కృషికి, తన కష్టానికి తగిన ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు శ్రావణ్.
హుజురాబాద్‌కి చెందిన మాడిశెట్టి అనన్య తల్లిదండ్రులు అజయ్ కుమార్, రేవతి. ఇద్దరూ న్యాయవాదులు. గత ఆరేళ్లుగా పట్టుబట్టి మరీ సివిల్స్ రాస్తున్నారు అనన్య. ఇప్పటి వరకు నాలుగు సార్లు ప్రిలిమ్స్‌ని క్లియర్ చేయగలిగారు. అయితే లక్ష్యానికి కొంత దూరంలో ఆగిపోతుండడంతో అనన్య తల్లి రేవతి మరింత ప్రోత్సహించారు. ఎలాంటి కోచింగ్ లేకపోయినా కూడా తల్లి ప్రోత్సాహంతోనే తాను 544 వ ర్యాంక్ సాధించగలిగాను అని మాడిశెట్టి అనన్య ప్రియా తెలిపారు.