Forest Officer Idea: జగిత్యాల జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచేందుకు ఆ శాఖ అధికారులు అద్భుతమైన ఐడియాను కనిపెట్టారు. అంతే కాదు అనుకున్న ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. వనాలను పెంచేందుకు ముందుగా విత్తనాలు వేయాలి. గతంలో అయితే హరిత వాహనాలను వీటి కోసం వాడుకున్నారు. కొన్ని చోట్లకు అయితే కాలి నడకన వెళ్లి విత్తులు నాటాల్సి వచ్చేది. కానీ ఇప్పడు సరికొత్త టెక్నీలజీని వాడుతూ అందిరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. అయితే అసలు ఏం చేస్తున్నారని అని అనిపిస్తోంది కదా..
డ్రోన్ల ద్వారా విత్తనాలు..
సాధారణ అవసరాలకు వాడే డ్రోన్ల ద్వారా సుదూర తీరాల్లో, గుట్టల్లోని ప్రాంతాల్లో విత్తనాలను నాటడానికి సీడ్ బాల్స్ ని వినియోగించారు. ఎత్తైన గుట్టలు, సమస్యాత్మ ప్రాంతాల్లోకి వెళ్లకుండానే... డ్రోన్ల ద్వారా దాదాపు 25 వేల విత్తనాలను వేశారు. అడవీ విస్తీర్ణం పెంచేందుకు డ్రోన్లు చాలా బాగా ఉపయోగ పడుతున్నాయని జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వరరావు అంటున్నారు.
"వన్ బిలియన్ మొక్కలు వేయాలనే ఉద్దేశంతోనే డ్రోన్లను వాడుతున్నాం. ముఖ్యంగా గుట్టలు, వెళ్లలేని ప్రాంతాల్లోకి సీడ్ బాల్స్ తయారు చేసి.. డ్రోన్స్ ద్వారా వేస్తున్నాం. కెమెరాల్లో చూస్తూ.. డ్రోన్ల ద్వారా ఖాళీ ప్రదేశాల్లో మాత్రమే సీడ్ బాల్స్ వదులుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ లేని మొక్కలు ఎక్కువగా నాటేందుకు దృష్టి సారించాం. మారుత్ అనే స్వచ్చంధ సంస్థ వారు మాకు సాయం చేశారు. వీరి ద్వారానే మేము ఇన్ని మొక్కలను సులువగా నాటగలిగాం. " - వెంకటేశ్వరరావు, జిల్లా అటవీశాఖ అధికారి
ఇప్పటి వరకు 25 వేల సీడ్ బాల్స్..!
సాధారణంగా మొక్కలు నాటడానికి అత్యధిక సమయం తీసుకునే ఎత్తైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నట్లు అధికారులు చెప్పారు. ఇలా వాడటం ద్వారా దాదాపు ఒక కిలో మీటరు వరకు అంబర్ పేట గుట్ట ప్రాంతంలో 25 వేల వరకు సీడ్ బాల్స్ వదిలేయగల్గినట్లు వివరించారు. విత్తనాలకు తగిన పోషకాలతో కూడిన సీడ్ బాల్ ద్వారా అటవీ విస్తరణ త్వరితగతిన జరుగుతుందన్న విషయం అందరికీ తెలుసునని చెప్పారు.
అందుకే విత్తనం నుండి మొక్కగా పరిణామం చెందే క్రమంలో ఎలాంటి క్రిమి కీటకాలకు ఆహారంగా మారే అవకాశం లేకుండా... విత్తనాలు తమ చుట్టూ ఉన్న మట్టి ద్వారానే పోషకాలను అందుకోగలుగుతాయని స్పష్టం చేశారు. దీనికి తోడుగా టెక్నాలజీ వాడడంతో అతి తక్కువ సమయంలో ఎక్కువ మొక్కలను నాటే ఈ ప్రక్రియను తాము త్వరగా పూర్తి చేయగల్గామని జగిత్యాల అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
హ్యాట్సాఫ్ టు ఫారెస్ట్ ఆఫీసర్స్..!
విషయం తెలుసుకున్న ప్రకృతి ప్రియులు అధికారుల ఐడియాకు ఫిదా అయ్యారు. కొత్త టెక్నాలజీని వాడుకొని మొక్కలు పెంచడం అనేది చాలా మంచి విషయం అని చెబుతున్నారు. అంతరించి పోతున్న అడువుల విస్తీర్ణం పెంచేందుకు.. సరికొత్త టెక్నాలజీ వాడడం గర్వించదగ్గ విషయం అని అంటున్నారు. ఏది ఏమైనా అడవుల పెంపకం, విస్తీర్ణం పెంచడం వల్ల స్థానిక ప్రజలలతో పాటు అడవిలో ఉండే జంతువులకు కూడా మంచి జరుగుతుందని చెబుతున్నారు.