Telangana: తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జ్వరాల బారిన పడ్డవారు ఆసుపత్రుల్లో అడ్మిట్ అవుతున్నారు. విష జ్వరాల బారిన పడ్డవారి సంఖ్య రోజురోజుకీ విజృంభిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు, డెంగీ ఫీవర్ కేసులు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. కరీంనగర్ ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది.


కరీంనగర్ ప్రభుత్వాసుపత్రి కిటకిట


కరీంనగర్ జిల్లా ప్రభుత్వం ప్రధాన ఆసుపత్రిలో ఇప్పటికే ప్రతిరోజు వందల సంఖ్యల్లో రోగులు జ్వరాల బారిన పడి అడ్మిట్ అవుతున్నారు. ప్రతిరోజు వందల సంఖ్యలో డెంగీ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. రోజు మూడు నుంచి 5 కేసుల వరకు డెంగీ పాజిటివ్ కేసులు బయపడుతున్నాయి. వచ్చిన రోగులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తూ వైద్యం అందిస్తున్నామని కరీంనగర్ ప్రధాన ఆసుపత్రి సూపరిండెంట్ వీరారెడ్డి తెలిపారు. ఎలాంటి జ్వరం వచ్చినా డెంగీగా భావించి వైద్యులను సంప్రదించాలని ఆయన సూచిస్తున్నారు. 



ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాల కొరతపై రోగుల అసంతృప్తి


జ్వరాలు వచ్చి ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నామని రోగలు చెబుతున్నారు. వైద్యంతోపాటు సౌకర్యాల కొరత ఉందని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. రోగులకు సెలైన్ ఎక్కించలేని పరిస్థితి ఉందని స్టాండ్ల కొరత వేధిస్తోందంటున్నారు. అందుకే కిటికీ గ్రిల్స్‌కి బిగించి సెలైన్లను ఎక్కిస్తున్నారని అంటున్నారు. ముక్కు మూసుకొని బాత్రూంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని రోగులు చెబుతున్నారు. వైద్యులు నర్సులతో ఇబ్బంది లేదంటున్నారు. 


Also Read: అమెరికాకు వెళ్లిన కరీంనగర్ మేయర్, నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ - రీజన్ ఏంటంటే!


డెంగీ జ్వరం వస్తే ఇలా తెలుసుకోవాలి...?
సామాన్యంగా ఈ మధ్యకాలంలో ఎలాంటి జ్వరం వచ్చినా డెంగీగా భావించి వైద్యులను సంప్రదించి వైద్యం చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం వచ్చిన మూడు రోజులకి డెంగీగా మారే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ కళ్ళు ఎర్రబడ్డ కాళ్లు చేతులు విపరీతంగా నొప్పులు వచ్చిన డెంగీగా నిర్ధారణ చేసుకోవాలని చెబుతున్నారు. 



భయపడొద్దని సూచిస్తున్న వైద్యాధికారులు


మంకీ పాక్స్ వ్యాధి వెలుగులోకి వచ్చిన వేళ ప్రజలు భయపడాల్సిన పని లేదంటున్నారు వైద్యులు. ఇప్పటి వరకు భారతదేశంలో ఎలాంటి కేసులు నమోదుకాలేదని ధైర్యం చెబుతున్నారు. ఒక వేళ కళ్ళు  వంటిపై ఎర్రటి దద్దుర్లు వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలని కరీంనగర్ ప్రధాన ఆసుపత్రి సూపర్డెంట్ అంటున్నారు. విష జ్వరాల బారిన పడ్డ రోగులు మంచి పోషక ఆహారాలను తీసుకోవాలని చెబుతున్నారు. 


Also Read:సారు నా కొడుకులు అన్నం పెడతలేరు - వృద్ధురాలు ఆవేదన, పోలీసులకు ఫిర్యాదు